బాలకృష్ణ దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మీదే ఉంది. దాన్ని ఎంత త్వరగా తీసుకురావాలా?? అనేది బాలయ్య ఆలోచన. మార్చి నుంచి రెగ్యలర్ షూటింగ్ మొదలవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అందరిలోనూ చాలా సందేహాలు నెలకొన్నాయి. ఆయన జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ తీస్తారు? చంద్రబాబు ద్రోహం, ఎన్టీఆర్ దయనీయమైన చివరి రోజులు.. ఇవన్నీ చూపిస్తారా, లేదా? అనే అనుమానాలు ఉండేవి. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరవాత కథ ఆగిపోతుందని, ఆ తరవాత ఏమీ చూపించరని, చూపించాల్సివస్తే.. చంద్రబాబు ద్రోహం కూడా చూపించాలి కదా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే… ఎన్టీఆర్ బాల్యం నుంచి మరణం వరకూ ఆత్మకథ ఉండబోతోంది. ఎన్టీఆర్ జీవితంలోని ప్రతీకోణం.. తెరపై చూపించబోతున్నారు. అయితే దేనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నదే ఇంకా తెలియాల్సివుంది. పార్టీ స్థాపించడం, దానికి తెలుగుదేశం అని నామకరణం చేయడంతో ఈ సినిమాకి ఇంట్రవెల్ కార్డు పడబోతోందని… సెకండాఫ్ అంతా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఉండబోతోందని తెలుస్తోంది.