ఈమధ్య బాలకృష్ణ వీర స్పీడుమీదున్నాడు. సినిమా తరవాత సినిమా.. గ్యాప్ లేకుండా చేసుకుపోతున్నాడు. సెంచరీ పూర్తయ్యాక ఆ జోరు మరింత పెరిగింది. అయితే… `ఎన్టీఆర్` బయోపిక్ మాత్రం బాలయ్య జోరుకు బ్రేకులు వేస్తోంది. సంక్రాంతి నుంచి… బాలయ్య ఖాళీనే. హిందూపురం పనుల్లోనూ, బసవతారకం ఆసుపత్రి పనుల్లోనూ బాలయ్య బిజీ అయ్యాడు. మార్చి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలవుతుందని అనుకున్నా.. ఇప్పటి వరకూ ఎలాంటి కదలిక లేదు. మార్చి చివరి వారంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలెడతామని బాలయ్య స్వయంగా చెప్పాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ జులైలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం తేజనే.
తేజ – వెంకీ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కింది. ఈనెల 25 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా పూర్తయ్యాకే.. ఎన్టీఆర్ బయోపిక్ మొదలవుతుంది. జూన్ చివరి వారం నాటికి వెంకీ సినిమా పూర్తి చేస్తానని తేజ చెప్పాడట. అందుకే తేజ కోసం బాలయ్య నిరీక్షణలో పడిపోయినట్టు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. బాలయ్య కూడా ఈ విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదని తెలుస్తోంది. ఎలాగూ షూటింగ్ ఆలస్యం అవుతోంది కదా.. అందుకే.. చిత్రబృందాన్నీ మెల్లగా ఎంచుకోవాలని బాలయ్య భావిస్తున్నాడని సమాచారం. జులైలో ఎన్టీఆర్ బయోపిక్ మొదలైనా.. అనుకున్న సమయానికే అంటే సంక్రాంతికే ఈ సినిమా రావడం ఖాయం. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్‌ని 90 రోజుల్లో పూర్తి చేయాలన్నది చిత్రబృందం ప్లాన్. తేజ కూడా అందుకు సమర్థుడే. కాకపోతే ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే.. ఈ గ్యాప్‌లో బాలయ్య మరో సినిమా చేస్తాడా, లేదా? అనే. బాలయ్య మాత్రం మరో సినిమాపై దృష్టి పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సి.కల్యాణ్ మాత్రం తన వైపు నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.