ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ చేసిన అత్యంత తెలివైన పని.. ఈ సినిమాని రెండు భాగాలుగా తీయాలనుకోవడం. రెండు భాగాలు అనేసరికి… చెప్పదలచుకున్న విషయమంతా చెప్పేసే ఆస్కారం దొరుకుతుంది. దాంతో పాటు.. వ్యాపార పరంగానూ లాభసాటిగా ఉంటుంది. పదిహేను రోజుల వ్యవధిలో రెండో భాగం విడుదల చేసిన ఘనత కూడా క్రిష్‌కి దక్కుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిడివి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. రెండు భాగాలు కాబట్టి… రాసుకున్న సీన్లన్నీ తీయొచ్చు.
కానీ క్రిష్‌కో కొత్త సమస్య వచ్చిపడింది. రోజుకో… కొత్త ఆలోచన, కొత్త సీనూ పుట్టుకొస్తున్నాయి. వాటిని తీస్తూ పోతున్నాడు క్రిష్. తీసిన ప్రతీ సన్నివేశం సినిమాలో ఉంటుందా, లేదా? అంటే క్రిష్ కూడా చెప్పలేని పరిస్థితి. బాలయ్య ఆదేశించడమో, లేదంటే తనకే `ఇక్కడ ఇలాంటి సీన్ పడితే బాగుంటుంది కదా` అని అనిపించడమో, లేదంటే ఎన్టీఆర్ గురించి ఓ సరికొత్త విషయం తెలియడమో.. ఇలా రకరకాల రూపంలో సీన్లు పెరుగుతూ పోతున్నాయి. వాటిని క్రిష్ కూడా తీసుకుంటూ వెళ్తున్నాడు. క్రిష్ చురుగ్గా ఉంటాడు కాబట్టి… ఎన్నిసీన్లయినా టక టక చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గరే అసలు సమస్య వచ్చిపడుతుంది. ఎలాంటి సీన్లు పక్కన పెట్టాలో తేల్చుకోవడం అంత సులభం కాదు. పోనీ… తీసినవన్నీ ఉంచేద్దామా అంటే నిడివితో సమస్య వచ్చి పడుతుంది. కొన్ని మంచి సీన్లు కూడా పక్కన పెట్టి… వాటిని తరువాత జోడించి విడుదల చేస్తే.. రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉందేమో అన్న మరో ఆలోచన కూడా ఉంది. క్రిష్ అండ్ కో.. ఏం చేస్తుందో చూడాలి.