ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతికి వెళ్లిన తరవాత… మరింత అటెన్షన్ తెచ్చుకుంది. ఈ సినిమాని తన చేతుల్లోకి తీసుకున్న తరవాత.. రూపు రేఖలు, ప్రమాణాలు మార్చడంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు క్రిష్. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ లుక్ చూస్తే… క్రిష్ ముద్ర స్పషంగా కనిపించింది. ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడానికి క్రిష్ ఓ పేట్రన్ ఎంచుకున్నాడు. ‘మనదేశం’ సమయంలో ఎన్టీఆర్ గెటప్ ని గుర్తు చేస్తూ.. సరిగ్గా అదే వేషధారణలో ఉన్న బాలయ్యని చూపించాడు. `మనదేశం`తోనే ఎన్టీఆర్ తెలుగు చలన చిత్రసీమలో కాలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చరిత్ర రాయాల్సివస్తే… ఆ సంఘటన మొత్తం ఓ అధ్యాయంగా నిలుస్తుంది. దాన్ని ఫస్ట్ లుక్ పేరుతో గుర్తు చేయడం.. నందమూరి అభిమానుల్ని ఆకట్టుకునేదే. బాలయ్య రూపం పూర్తిగా చూపించకుండా.. సైడ్ లుక్‌తో సరిపెట్టడం కూడా తెలివైన నిర్ణయమే. ఎన్టీఆర్ తన డైరీలో అభిమానులను ఉద్దేశించి రాసుకున్న మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసే ప్రయత్నం కనిపించింది. అది కూడా అభిమానుల మనసు గెలుచుకునే ప్రయత్నమే. మొత్తానికి `ఫస్ట్ లుక్`తో క్రిష్ ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ రూపు రేఖలకు బాలయ్య ఎంత వరకూ న్యాయం చేస్తాడో అనే బెంగ ఈ ఫస్ట్ లుక్‌తో కాస్త తీరిందనే చెప్పాలి.