‘యన్.టి.ఆర్’ బయోపిక్ ఓపెనింగ్ రోజున బాలకృష్ణ దుర్యోధనుడి గెటప్‌లో కనిపించారు. నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న బాలకృష్ణ సుమారు 50 గెటప్పుల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి ‘మనదేశం’లో గెటప్, అక్కినేని నాగేశ్వరారావుతో సిగరెట్ వెలిగిస్తున్న గెటప్, రాజకీయాల్లోకి వచ్చినప్పటి కాషాయం గెటప్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్ కూడా వుంది. అందులో అక్కినేని మనవడు సుమంత్ నటిస్తున్నాడు. సినిమాలో అక్కినేని గెటప్పులు ఐదారు వున్నాయట!
ఎన్టీఆర్ బయోపిక్ కనుక అక్కినేని పాత్ర ఎక్కువసేపు వుంటుందని, ఎక్కువ గెటప్పులు వుంటాయని ఆశించలేం. అయితే… సినిమాలో అక్కినేని పాత్రకు సముచిత ప్రాధాన్యం వుందని సుమంత్ చెప్పే మాట! 1950 నుంచి 1990 వరకూ ఎన్టీఆర్, ఏయన్నార్ మధ్య అనుబంధాన్ని దర్శకుడు క్రిష్ సినిమాలో చూపిస్తున్నారు. సినిమా నేపథ్యంగా వచ్చే సన్నివేశాలు కొన్ని అయితే, వ్యక్తిగత జీవిత నేపథ్యంగా వచ్చేవి మరికొన్ని వున్నాయి. సుమారు నలభై ఏళ్ళ ప్రయాణంలో తన పాత్ర (అక్కినేని పాత్ర) ఐదారు గెటప్పుల్లో వుంటుందని సుమంత్ తెలిపాడు. దర్శకుడు క్రిష్ కథ వివరించినప్పుడు తాతగారి పాత్రను ఇంత అద్భుతంగా రాస్తారని ఊహించలేదనీ, తాతగురించి తనకూ తెలియని ఎన్నో విషయాలను క్రిష్ చెప్పాడనీ సుమంత్ అన్నారు.