చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు అని కూడా చెప్పారు! హిందూపురంలోని తన పీయే శేఖర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పీయే శేఖర్ వ్యవహారమంతా ఒక వ్యూహాత్మకంగా జరిగిన కార్యక్రమంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. బాలయ్య కాన్ఫిడెన్స్‌ను దెబ్బతియ్యడం కోసమే జరిగిన ఘటనగా దీన్ని విశ్లేషిస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో బాలయ్య చేసిన ప్రకటన చంద్రబాబుపై విమర్శల్ని పెంచేసింది. ఎన్టీఆర్ జీవితంపై తాను సినిమా తీస్తాననీ, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ప్రకటించేసరికి… చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందా అనే చర్చ మొదలైంది!
ఎన్టీఆర్ జీవిత చిత్రం అనే మాట బాలయ్య తెరమీదికి రాగానే చాలామంది మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి లైన్లోకి వచ్చారు. ఈ సినిమా బాలయ్య తీస్తున్నాడని తెలిసిందనీ, చాలా సంతోషించ దగ్గ విషయమనీ ఆమె అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఈ క్రమంలో చంద్రబాబును హీరోగా చిత్రించే ప్రయత్నం చేస్తే మాత్రం… తాను కోర్టుకు వెళ్తానని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు నాయుడు విలన్ అనీ, ఆయన్ని అలానే చూపించాలని డిమాండ్. ఆ కథలో తమ పాత్రల్ని వేరేలా చిత్రించే ప్రయత్నం చేస్తే.. నిజాలు మాట్లాడాల్సి ఉంటుందని బాంబు పేల్చారు. నిజానికి తెలుగుదేశం పార్టీ తాను స్థాపించిందనీ, ఇప్పుడున్న నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కథలో విలన్ క్యారెక్టర్ చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు.
సో… ఇలా ఎన్టీఆర్ కథలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ ఊపందుకుంది. ఈ సినిమా తీస్తా అని బాలయ్య ప్రకటించిన దగ్గర నుంచీ చంద్రబాబుకు ఇదో కొత్త టెన్షన్‌గా మారిందనే చెప్పాలి. దీనిపై ఆయన స్పందించలేరు! అలాగని కుదురుగా ఉండలేని పరిస్థితి. మొత్తానికి, వియ్యంకుడు ఏ ఉద్దేశంతో ఈ సినిమా ప్రకటన చేశారో..?