ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రెండో పాట వచ్చింది. తొలి గీతం `కథానాయక`…. కథానాయకుడిగా ఎన్టీఆర్ విశిష్టతను వివరిస్తే… రెండో పాట `రుషివో రాజర్షివో…` ఎన్టీఆర్ జీవితంలోకి దూసుకొచ్చిన వైరాగ్యానికీ, వేదాంతానికీ, తాత్విక చింతనకూ నిలువుటద్దంగా నిలిచింది. శివశక్తి దత్తా, రామకృష్ణ, కీరవాణి కలసి రాసిన గీతమిది. జగద్గురు ఆదిశంకరుల నిర్వాణ షట్కమ్ శ్లోకంలోని కొన్ని భాగాల్ని ఈ పాట కోసం వాడుకున్నారు. శరత్ సంతోష్, మోహన భోగరాజు, శ్రీనిధి తిరుమలతో పాటు కీరవాణి, కాలభైరవ ఈ గీతాన్ని ఆలపించారు. బహుశా.. ఎన్టీఆర్ తన జీవితంలోనే ఎదుర్కున్న ఓ విపత్కర పరిస్థితి నేపథ్యంలో ఈ పాట వస్తుందనిపిస్తోంది.
మృత్యువంటే భయం లేనివాడు, జాతి బేధం తెలియనివాడు అనే అర్థాలతో పాట మొదలైంది. జాగృతంలో జాగు ఏదీ? రాత్రి ఏదీ పగలు ఏదీ? కార్య దీక్షా బద్ధుడవుగా అలుపు ఏదీ దిగులు ఏదీ? అంటూ కొన్ని పదాలు సామాన్య శ్రోతలకు అర్థమయ్యేట్టు రాసినా…. చాలా వరకూ సంస్క్కృత పదాలతో, శ్లోకాలతో నడిపించారు. కాకపోతే… వినే కొద్దీ వినాలనిపించేలా స్వరకల్పన, పద కల్పన… ఈ పాటని నిలబెట్టేస్తాయి. సన్నివేశంలో చాలా ఆర్థ్రత ఉందని, సంక్లిష్టత, ఉద్వేగం ఉన్నాయని ఈ పాటని బట్టి అర్థమవుతున్నాయి. మరి క్రిష్ ఎలా తీసి ఉంటాడో..? మొత్తం 11 పాటలున్న ఆల్బమ్ ఇది. వాటితో పాటు రెండు బిట్ సాంగ్స్ కూడా ఉంటాయి. మిగిలిన పాటలన్నీ ఈనెలాఖరులోగా ఒకొక్కటిగా విడుదల చేస్తారు.