మహానటికి జరుగుతున్నదే ఎన్టీఆర్ విషయంలోనూ జరుగుతోంది.
అవును… మహానటిని ఓ చిన్న సినిమాగా భావించి మొదలెట్టారు. కీర్తి సురేష్ తప్ప మిగిలిన పాత్రలేవీ ముందు అనుకోలేదు. ఒకొక్క పాత్ర వచ్చి చేరింది. ఒక్కొక్క స్టార్ ఈ సినిమాకి తోడయ్యాడు. సమంత, మోహన్‌బాబు, సల్మాన్ దుల్కర్, విజయ్ దేవరకొండ, నాని… ఇలా స్టార్ హంగామా పెరిగిపోతూ వెళ్లింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ సినిమా కాస్త మల్టీస్టారర్ రూపంలోకి వెళ్లిపోయింది.
ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణని అనుకోవడం మినహా… కాగితంపై మరో పేరు రాసుకోలేదు. ఇప్పుడు ఒకొక్క పాత్ర వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ జీవిత కథ అంటే చాలామంది స్టార్లని చూపించాలి. అక్కినేని, కృష్ణ ఇందులో కీలకం. బడా నిర్మాతలు, పేరున్న దర్శకులు, రాజకీయ వేత్తలు.. ఇలా చాలామందిని చూపించాలి. ఒకొక్క పాత్రకూ ఒకొక్క పేరు రాసుకుంటూ వెళ్తుంటే… ఎన్టీఆర్ బయోపిక్ కాస్త మహా మల్టీస్టారర్‌గా మారిపోతోంది. కృష్ణగా మహేష్‌బాబు అయితే బాగుంటుందన్నది ఓ ఆలోచన. రానాకీ ఓ పాత్ర దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రాజశేఖర్, కల్యాణ్రామ్లకూ ఛాన్సుంది. యంగ్ ఎన్టీఆర్‌గా ఓ యువ హీరో కనిపించబోతున్నాడు. బసవతారకం నుంచి శ్రీదేవి వరకూ ప్రతీ ఆడ పాత్రకూ ఓ పేరున్న కథానాయికని తీసుకోవాలన్నది బాలకృష్ణ ఆలోచన. చిన్న చిన్న పాత్ర అయినా సరే.. అందులో స్టార్ కనిపించేలా జాగ్రత్త తీసుకుంటున్నాడట బాలయ్య. ఎన్టీఆర్ మినహా దాదాపుగా నందమూరి హీరోలంతా ఈసినిమాలో కనిపించబోతున్నారు. అక్కినేని పాత్ర ఎవరు చేస్తారన్నది కీలకంగా మారింది. ఆ నటుడెవరన్నది తెలిస్తే… ఈ సినిమాకి మరింత హైప్ రావడం ఖాయం.