ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడుగా ఎన్టీఆర్ బయోపిక్ రాబోతోంది. ‘కథానాయకుడు’కి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోయినట్టే. అక్కడక్కడ కొన్ని ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలాయి. అయితే.. కృష్ణ కు సంబంధించిన సన్నివేశాలు మాత్రం తెరకెక్కించలేదు. ఎన్టీఆర్ – కృష్ణలకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలసి చాలా సినిమాల్లో నటించారు. చివర్లో ఎన్టీఆర్ – కృష్ణకు మధ్య కొన్ని అభిప్రాయ బేధాలూ వచ్చాయి. అయితే… వాళ్ల స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు.
వాళ్ల అనుబంధాన్ని ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లోనూ చూపించబోతున్నారు. అయితే.. కృష్ణగా ఎవరిని ఎంచుకోవాలి? అనే ప్రశ్నకు మాత్రం ఇంకా ఓ సమాధానం దొరకలేదు. కృష్ణ పాత్ర లేకుండా ఎన్టీఆర్ బయోపిక్‌ని వదలడానికి బాలకృష్ణకు సైతం మనసు రావడం లేదట. అందుకే.. ఈ పాత్ర కోసం మహేష్‌బాబుని సంప్రదించారు. స్వయంగా బాలయ్యే మహేష్‌కి ఫోన్ చేసి ‘మీ నాన్నగారి పాత్ర చేస్తావా’ అని అడిగినట్టు తెలుస్తోంది. మహేష్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో మహేష్ కోసం ఎన్టీఆర్ టీమ్ ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. అయితే చిత్రబృందం మాత్రం ‘కృష్ణగా మహేష్ కనిపించడం ఖాయం’ అనే సంకేతాలు పంపుతోంది. ఒకవేళ మహేష్ నో అంటే మాత్రం.. కృష్ణ పాత్ర లేకుండానే ఈ సినిమాని వదిలేస్తారని సమాచారం. మహేష్ కూడా ఈ బయోపిక్‌కి తోడైతే – ఈ సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మరి మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో??