ఎన్టీఆర్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. చిన్న తనం విషయాలనూ గుర్తు చేసుకుంటున్నాం. సినిమాలు, రాజకీయాలు ఇలా ప్రతి పుట్టిన రోజుకూ గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు వందో పుట్టినరోజు. ఇంత మంది ఇలా గుర్తు చేసుకుంటున్నారంటేనే ఆయన తెలుగుజాతిపై శాశ్వతంగా పడిపోయే ముద్ర వేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ వందేళ్లు కాదు.. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే మూడక్షరాలు నిలిచి ఉంటాయి.
అయితే ఇక్కడ అందరూ గుర్తు చేసుకునేది..చెప్పుకునేది ఎన్టీఆర్ వ్యక్తి గురించి మాత్రమే కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ వ్యక్తి కాదు. వ్యవస్థ. ఆయన సాధించిన విజయాలు.. చూపిచిన పట్టుదల అనన్య సామాన్యం. అదే భావితరాలకు స్ఫూర్తి. అరవై ఏళ్ల తర్వతా ప్రజా జీవితంలోకి రావాలనుకున్నారు. అప్పటి వరకూ ఆయన సాధించిన విజయాలతో విలాసంగా గడపవచ్చు.. కానీ ఆయన తన రోల్ ను ప్రజల కోసం కేటాయించాలనుకున్నారు. అంతే .. ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసం పోరాడారు. అలాంటి పోరాటయోధులను మనం ఇక ముందు చూడకపోవచ్చు. కానీ ఆయన నుంచి నేర్చుకోవచ్చు.
సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. దేవుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన వేసిన పాత్రలతో అలాగే ఉంటారేమో అనిపించేలా చేశారు. ఒకప్పుడు తిరుపతికి వెళ్లిన శ్రీనివాసుడి భక్తులు.. మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ దర్శనం చేసుకోవడాన్ని సెంటిమెంట్ గా పెట్టుకునేవారు. అది ప్రజల జీవితాలపై ఆయన చేసిన సంతకం. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా ?
ఎంత చేసినా.. ఎన్ని విజయాలు సాధించినా..ఎన్ని జీవితాలు మార్చినా ఆయన మనిషే. మనుషుల్లోనే మహానుభావుడు. చదువుకున్న మూర్ఖులు పెరుగుతున్న కొద్దీ..సమాజం కూడా సమాజం కులం, మతం, ప్రాంతం అంటూ విడిపోతూనే ఉంది. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన బాబా సాహెబ్‌ను దళితులకే పరిమితం చేసే సమాజం మనది. అలాంటప్పుడు ఎన్టీఆర్ లాంటి వారిపై మాత్రం .. విద్వేషాలు రెచ్చగొట్టరని ఎలా అనుకుంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన కొంత మందికి వ్యతిరేకమవుతారు. అయ్యారు. ఆ వ్యతిరేకత కారణంగా ఆయనను ద్వేషించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెచ్చి నమార్పులతో బడుగులు రాజకీయాధికారం సాధించారంటే .. ఎవరూ కాదనలేరు. ఆదీ అయన వేసిన ముద్ర.
ఆయన జీవితం, విజయాలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ఏదైనా స్ఫూర్తి దాయకమే. అలాంటి శకపురుషుడు మళ్లీ పుట్టడం కష్టమే. అందుకే ఎన్టీఆర్ అనే మూడక్షరాలు .. తెలుగుజాతి ఉన్నంత కాలం ఉంటాయి. తుడిచేస్తే తుడిచేవి కావు. విమర్శిస్తే పోయేవి కావు.