వంగవీటితో వర్మ మరోసారి తేనెతుట్టెను కదపబోతున్నాడా? కమ్మ, కాపు వర్గాల మధ్య ఉన్న చిచ్చుని వర్మ రగిలిస్తున్నాడా? పాత కక్ష్యల్ని గుర్తు చేసేలా వంగవీటి ఉంటుందా? ఇంతకీ వంగవీటి కథలో హీరో ఎవరు? విలన్ ఎవరు? ఇవన్నీ ప్రశ్నలే! వీటికి సమాధానం తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే. అయితే… ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. వంగవీటి హత్య సమయంలో అప్పట్లో అధికారంలో ఉన్నది అన్న ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీనే. అప్పట్లో పార్టీ వైఖరి ఎలా ఉండేది? వంగవీటికీ ఎన్టీఆర్‌కీ ఉన్న సంబంధాలేంటి? అనే విషయాల్ని వర్మ ఏరూపంలో చూపించబోతున్నాడన్న ఆసక్తి నెలకొంది. వంగవీటిలో ఎన్టీఆర్‌ని పోలిన ఓ పాత్ర ఉందని, ఎన్టీఆర్‌ని చూపించకపోయినా ఆ పాత్ర ప్రస్తావన పదే పదే వస్తుందని తెలుస్తోంది. రక్త చరిత్రలోనూ ఎన్టీఆర్ ఎపిసోడ్‌ని చాలా తెలివిగా డీల్ చేశాడు వర్మ. చేతికి మట్టి అంటకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ తనకు నెగిటీవ్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
వంగవీటి సినిమా విజయవాడలో సంచలనం రేపనుంది. దానికి తగ్గట్టుగానే వంగవీటి బుకింగ్స్ మొదలైన గంటకే మల్టీప్లెక్స్‌లో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వంగవీటి సినిమా ఎక్కడ ఆడినా, ఆడకపోయినా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం బాగానే ఆడుతుందని ముందే గ్రహించిన నిర్మాత దాసరి కిరణ్.. ఆయా ఏరియాల రైట్స్‌ని తన దగ్గరే ఉంచుకొన్నాడు. ఈసినిమాకి దాదాపుగా రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యిందన్న టాక్స్ వినిపిస్తున్నాయి. స్టార్ కాస్టింగ్ ఏమీ లేకుండా వర్మ ఈ స్థాయిలో ఖర్చు పెట్టాడంటే గొప్ప విషయమే. రన్ టైమ్ కూడా 2 గంటల 22 నిమిషాలు వచ్చిందట. ఈ మధ్య కాలంలో వర్మ తీసిన పెద్ద సినిమా ఇదే. ఎందుకంటే వర్మ సినిమాలన్నీ రెండు గంటల లోపే ముగిసిపోతున్నాయి. విడుదలకు ముందు వంగవీటి కొత్త ట్రైలర్ వదిలాడు వర్మ. అదీ జనరంజకంగానే ఉండడంతో ఈ సినిమాపై మరింత ఫోకస్ పెరిగింది.