రాజకీయ నాయకుడు అంటే ప్రజల జీవితాల్ని మార్చేవాడు. విప్లవాత్మక నిర్ణయాలతో తరతరాలుగా ప్రయోజనాలు పొందేలా చేసేవాడు. ఇలాంటి రాజకీయ నేతలు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో జీవితాల్లో వెలుగులు నింపుకుని పేదరికం నుంచి బయటపడి తరాలుగా ఆ వెలుగులను ప్రశాశితం చేస్తున్న వారు లక్షల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు అందుకే ఎన్టీఆర్ ను మహాపురుషునిగా గుర్తుంచుకుంటారు. ఇవాళ ఆయన వర్థంతి.
ఎన్టీఆర్ పిలుపే ప్రభంజనం
తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా! అన్న, అన్న పిలుపు పై ఆంధ్రదేశమే అన్న వెంట పరుగులు తీసింది. చిన్నా, చితకా, ముసలి, ముతకా తేడా లేకుండా.. చైతన్య రధం వెంట పరుగులు తీసిన సమ్మోహనం ఆయనది. ఎంత చెప్పినా.. ఎంత తీసినా.. ఆయన జీవితంలో ఎంతో కొంత భాగం మిగిలే ఉంటుంది. అటు సినిమా కానీ.. ఇటు రాజకీయం కానీ అదో అంతులేని సముద్రం. కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతుబిడ్డగా పయనం సాగించి.. సినీ, రాజకీయ రంగాల్లో .. చెరగని సంతకంగా మారిన యుగపురుషుడు ఎన్టీఆర్. సినిమాల్లో తన ముద్ర ఎంత బలంగా వేశారో.. రాజకీయాల్లోనూ అలాగే మేరునగధీరుడిగా ఎదిగారు. ప్రపంచ సినీ చరిత్రలోనే దేనికవే భిన్నమైన పాత్రలను పోషించిన మహానటుడు మరె క్కడా కనిపించరు. హీరోలుగా వెలుగొందుతున్న వారు ప్రతినాయక పాత్రలు వేయరు. కానీ ఎన్టీఆర్ మాత్రం పురాణాలలోని ప్రతినాయక పాత్రలైన రావణబ్రహ్మ, దుర్యోధన వంటి పాత్రలను రక్తికట్టించి ప్రజామోదం పొందారు. దానవీరశూరకర్ణలో కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా ఆయన చూపిన అభినయం తెలుగుప్రజల హృదయాల్లో స్థిరస్థాయిని పొందింది. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక పాత్రలలో ఒదిగి ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. దైవత్వానికి రూపం ఇస్తే ఇలా వుంటుందనిపించేలా వెలిగిన నిండైన విగ్రహం ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకగా నిలిచినవాడు. వాల్మీకి, వ్యాస మహర్షులు రచించిన కావ్యాలలోని రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళకు సజీవ రూపం రామారావు. చిన్న రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వామనావతారం ఎన్టీఆర్.
రాజకీయాల్ని సంక్షేమ బాట పట్టించిన దార్శనికుడు…!
తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసిన ప్రజానేత, విశ్వనటుడు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలతో అన్న అని పిలిపించుకున్న అజరామరుడు. నాలుగున్నర దశాబ్దాలపాటు వెండితెర వేలుపుగా, సాంఘిక, పౌరాణిక పాత్రల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన మహానటుడు. తెలుగుజాతి గుండెల్లో చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో… ఆయన జీవితం సాగింది. సాగింది. తెలుగు సాహిత్యంపై అపారమైన పట్టున్న ఏకైక వెండితెర నాయకుడు నందమూరి. ఆయన నటించిన సినిమాలన్నిటా తెలుగువారి జీవితం, సంప్రదాయం నిండుగా వుంటాయి. తెలుగుదనం ఉట్టి పడుతుంది.
నేడు కుల ఛట్రంలో ఇరికించినా తెలుగుజాతిపై ఆయనది చెరగని సంతకం..!
ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేశారు. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం పేదల పెన్నిధిగా జీవించారు. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్ టి ఆర్. రాజకీయ వ్యూహాల్లో ఆయన కుల చట్రంలో ఇరుక్కుపోవచ్చు కానీ.. ఆయన ఇచ్చిన గుర్తింపు .. తెలుగువారికి కంఠాభరణంగా ఉంటుంది. ఆయన పంచిన వెలుగుల్లో కొన్ని తరాలు భవిష్యత్‌ను వెదుక్కుంటూనే ఉంటాయి.