కెవి రెడ్డి అంటే.. ఎన్టీఆర్కి గురు సమానులు. కేవి రెడ్డి యస్ అంటే యస్.. నో అంటే నో. ఆయన మాటకు ఎన్టీఆర్ అంత విలువ ఇచ్చేవారు. అయితే ఓసారి కేవి రెడ్డి మాటకు ఎదురెళ్లారు ఎన్టీఆర్. ఆయన మాట కాదని ఓ సినిమా తీశారు. ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో విజయమూ సాధించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ తెలియాలంటే సీతారామ కల్యాణం సినిమా రోజుల్లోకి వెళ్లిపోవాల్సిందే.
ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి రాసుకున్న స్క్రిప్టు సీతారామకల్యాణం. ఆ సినిమాని కేవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. స్క్రిప్టు తీసుకెళ్లి కెవిరెడ్డి చేతిలో పెట్టారు. అదంతా చదివి.. ‘చాలా బాగా తయారు చేశావ్ కథ… ఇందులో రావణాసురుడే హీరో. మరి ఆ పాత్ర ఎవరితో చేయిస్తావ్’ అని అడిగారు.
‘ఆ పాత్ర నేనే చేద్దామనుకుంటున్నా గురువుగారూ’ అని బదులిచ్చారు ఎన్టీఆర్.
‘రాముడూ నువ్వే.. రావణాసురుడువీ నువ్వే అంటే బాగోదేమో`’అని సందేహించారు కేవి రెడ్డి.
‘రావణాసురిడి పాత్ర నేను చేస్తా. రాముడి పాత్రను ఇంకొకరితో చేయిస్తా..’ అని ఎన్టీఆర్ చెప్పేసరికి.. కెవి రెడ్డి షాకయ్యారు.
‘నువ్వు రాముడిగా బాగుంటావని ఈ లోకానికి చెప్పింది నేనే. ఆ పాత్ర చేసినవాళ్లు రావణాసురిడి పాత్రలో మెప్పించలేరు. పైగా.. నువ్వు రావణాసురిడిగా పనికి రావు. ఎస్వీ రంగారావు ఆ పాత్ర చేశాక…. ఇంకెవరినీ అందులో ఊహించలేరు..’ అని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు.
కానీ ఎన్టీఆర్ మాత్రం ‘రావణాసురిడి పాత్ర చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కథ రాసుకున్నా గురువుగారూ. ఆ పాత్ర నేను చేయకూడదంటే ఈ ప్రాజెక్టే అవసరం లేదు’ అనేసరికి
‘అలాగైతే డైరెక్షన్ కూడా నువ్వే చేసుకో.. నేను చేయను’ అని కెవిరెడ్డి మొండికేశారు.
ఆ మాటని ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకుని. దర్శకత్వ బాధ్యత కూడా తన నెత్తిమీదే వేసుకున్నారు. రాముడిగా ఎవరిని ఎంపిక చేయాలి? అనేది పెద్ద ప్రశ్న.
చాలామంది కొత్త మొహాల్ని పరిశీలించారు ఎన్టీఆర్. కానీ ఏ ఒక్కరూ తన అంచనాలకు దగ్గరగా రావడం లేదు. మరోవైపు రాముడి పాత్రధారి దొరికితే గానీ షూటింగ్ మొలవ్వదు. ఇలాంటి సమయంలో.. పాండీ బజార్లో ఓ షూర్ట్కి వెళ్లారు ఎన్టీఆర్. ఆయన రాకతో.. షూమార్ట్ అంతా సందడి నెలకొంది. తనకు కావల్సిన చెప్పుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్న ఎన్టీఆర్కి ఓ కుర్రాడు ఎదురు పడ్డాడు. చూడగానే ఎన్టీఆర్ కి నచ్చాడు. తన కళ్లలో ఏదో మెరుపు కనిపించింది. ఆ అబ్బాయిని పిలిచి.. ‘నీ పేరేంటి?’ అని ఆరా తీశారు. ఆ అబ్బాయి కూడా సినిమా మీద ప్రేమతో మద్రాస్ వచ్చాడని తెలుసుకుని.. ‘నేనో సినిమా తీస్తున్నా. అందులో హీరోగా చేస్తావా’ అని అడిగారు. ‘ఎన్టీఆర్ అంతటి వాడు. పిలిచి మరీ అవకాశం ఇస్తానంటే ఎవరైనా వదులుకుంటారా? ఓకే అనేశాడు. ఆ కుర్రాడి పేరే. హరనాథ్. ‘సీతారామకల్యాణం’ లో రాముడిగా కనిపించి మెప్పించాడు. ఇక.. నారథుల వారి పాత్రకు నటుడు కావాలి. అంతకు ముందే.. ఓ సినిమాలో ఏఎన్నార్ ఆ పాత్ర చేసి రాణించారు. కానీ ఏఎన్నార్ చేయాల్సింత పెద్ద పాత్ర కాదది. అందుకే ఏఎన్నార్ని అడగడం సబబు కాదని తెలిసి, కాంతారావుని పిలిపించారు ఎన్టీఆర్. అంతకు ముందెప్పుడూ కాంతారావు నారథుడిగా కనిపించలేదు. పైగా చిన్న పాత్ర. హీరోగా రాణిస్తూ, చిన్న పాత్ర లో కనిపించడం కష్టమే. కానీ రామారావు మాట కాదనలేక కాంతారావు నారథుడిగా నటించడానికి ఒప్పుకున్నారు. అలా సీతారామకల్యాణం ప్రారంభమై.. చక చక షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఫస్ట్ కాపీని కెవి రెడ్డికి చూపించారు ఎన్టీఆర్. అది చూసి.. ‘ఆరి భడవా… నేను లేకుండా నాలానే తీసేశావ్ సినిమా.. నువ్వు పాత్రల్ని ఎంపిక చేసుకున్న తీరు అమోఘం. రావణాసురిడిగా నువ్వు రాణించలేవనుకున్నా. కానీ నా ఆలోచన తప్పని నిరూపించావు’ అని మెచ్చుకున్నారు. రాముడిగా హరనాథ్కి, నారథుడిగా కాంతారావుకీ చాలా మంచి పేరొచ్చింది. రావణాసురిడిగా ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనలో రాముడే కాదు, రావణుడూ ఉన్నాడని ఆయన నిరూపించుకోగలిగారు.