అదేంటో ప్రశాంత్ నీల్ కి యాక్షన్, హీరో ఎలివేషన్లు తప్ప… హీరోయిన్, వాళ్ల గ్లామర్ అస్సలు పట్టవు. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సలార్ లో అయితే ప్రభాస్ పక్కన హీరోయినే లేదు. ఎన్టీఆర్ తో తీస్తున్న ‘డ్రాగన్’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం సాగడం లేదు. ఈ సినిమాలో రుక్మిణీ వసంతన్ కథానాయిక. తనది రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్ కాదు. పద్ధతి, సంప్రదాయం తెలిసిన పాత్రల్లో నటిస్తుంది. ‘డ్రాగన్’లో కూడా ఈ టైపు పాత్రేనట.
ఎన్టీఆర్ సినిమా అనగానే అభిమానులు డాన్సులు, రొమాన్స్ ఆలోచిస్తారు. వాళ్లకోసమైనా ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఐటెమ్ సాంగ్ ఒకటి పెడతాడని భావించారు. పైగా శ్రుతిహాసన్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈమధ్యే రష్మిక మందన్నాని తీసుకొన్నారంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ రెండు వార్తల్లోనూ ఏమాత్రం నిజం లేదని సమాచారం. ఎప్పటిలా ప్రశాంత్ నీల్ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగుతుందని, మహిళా పాత్రలు చాలా తక్కువ కనిపిస్తాయని, రుక్మిణీ వసంతన్ పాత్ర కూడా చాలా పద్ధతిగా, తక్కువ రన్టైమ్లోనే ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 15 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆగస్టు లో ఎన్టీఆర్ ‘వార్ 2’ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా 9 నెలల గ్యాప్లో ఎన్టీఆర్ నుంచి మరో సినిమా వస్తోందన్నమాట.