ఎంత సంపాదించామన్నది కాదు. దాన్ని ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టామన్నది చాలా ముఖ్యం. డబ్బుకి విలువ ఇవ్వకపోతే, అది మన దగ్గర ఉండదు. ఉన్నా – ఆపద సమయంలో అక్కరకు రాదు. చిత్రసీమలో స్టార్లుగా ఎదిగి, చివరి దశలో – డబ్బుల్లేక గిలగిలలాడినవాళ్లు, పేదరికంతో అలమటించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. స్వర్ణయుగాన్ని చూసినవాళ్లలో చాలామంది – అవశాన దశలో – రూపాయి ఇచ్చే దిక్కు లేక విలవిలలాడారు. అలాంటి వాళ్లలో కాంతారావు ఒకరు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కి ధీటుగా సినిమాలు చేసి, మంచి ఇమేజ్ దక్కించుకుని, లక్షలు గడించిన కాంతారావు…చివరి దశలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఎన్టీఆర్ చేసిన హితబోధ ఆయన కళ్లు తెరిపించింది. ఈ విషయాన్ని కాంతారావు స్వయంగా తన ఆత్మ కథ అనగనగా ఒక రాజకుమారుడు లో రాసుకున్నారు కూడా.
`శభాష్ రాముడు` షూటింగ్ జరుగుతున్న రోజులు అవి. ఎన్టీఆర్ కథానాయకుడు. అందులో కాంతారావు విలన్. ఓరోజు సెట్లో ఉండగా కాంతారావుకి టెలీగ్రామ్ వచ్చింది. అమ్మమ్మకి ఒంట్లో బాలేదు, వెంటనే బయలుదేరి రమ్మని. అప్పటికి కాంతారావు బిజీనే. చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ డబ్బుల్లేవు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టడం, జల్సాలు చేయడం, గుర్రపు పందాలు ఆడడం, అపాత్రదానం చేయడం.. ఇలా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి – ఉన్నదంతా ఊడ్చేశారు.
ఊరెళ్లడానికీ, అక్కడ అమ్మమ్మకి సపర్యలూ చేయడానికి, ఒకవేళ జరగకూడనిది ఏమైనా జరిగితే అంతిమ సంస్కారాలు చేయడానికి కాంతారావు దగ్గర డబ్బుల్లేవు. నిర్మాత సుందర్ లాల్ మెహతా దగ్గరకు వెళ్లి, పరిస్థితి అంతా వివరించి, ఆర్థిక సహాయం చేయమని అర్థించారు. `ఇప్పటికే ఈ సినిమాకి ఇవ్వాల్సిన పారితోషికం లో సగం ఇచ్చేశాను. సినిమా పూర్తవ్వకుండా మొత్తం పారితోషికం ఇవ్వలేను..“ అని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. నిర్మాత మొహం మీద అలా అనేసరికి.. కాంతారావు మొహం చిన్నబోయింది. అయితే ఇదంతా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లింది. కాంతారావుని తన ఇంటికి రమ్మని కబురు పంపారు.
`విషయం తెలిసింది బ్రదర్.. మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి జరగాల్సింది చూడండి..` అంటూ కొంత మొత్తం కాంతారావు చేతిలో పెట్టారాయన.
అవసరానికి సాయం చేసిన ఎన్టీఆర్ ఆ సమయంలో నిజంగా దేవుడిలా కనిపించారు కాంతారావుకి.
అయితే ఎన్టీఆర్ మాత్రం `ఇప్పుడు ఈ డబ్బు ఇస్తుంది అప్పు అనుకోండి. తిరిగొచ్చాక మాత్రం ఇచ్చేయండి` అని ఖరాఖండీగా చెప్పేశారు. నిజానికి ఎన్టీఆర్ స్టేటస్కీ, ఆయనకున్న ఆస్తికీ, కాంతారావుతో ఉన్న అనుబంధానికి అంత చిన్న మొత్తం తిరిగి అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాంతారావు తిరిగి ఇస్తానన్నా `వద్దులెండి..` అని చెప్పొచ్చు. కానీ ఎన్టీఆర్ ఖరాఖండీగా `ఇది అప్పు మాత్రమే` అని గుర్తు చేసేసరికి కాంతారావు మనసు ఏదోలా అయిపోయింది.
`చూడండి బ్రదర్.. డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే, ఇలాంటి సమస్యలే వస్తాయి. దేనికైనా జాగ్రత్త అవసరం. అది మీకు ఉంటే ఈరోజు ఇలా చేతులు చాచి నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మీకు ఇదో పాఠం కావాలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి` అంటూ హితబోధ చేశారు.
ఎన్టీఆర్ మాటలు కాంతారావులో మార్పులు తీసుకొచ్చాయి. అప్పటి నుంచీ ఆయన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. కానీ.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. స్టార్ డమ్ పోయి, ఆస్తులు కరిగి, అప్పులు మిగిలి, ఆర్థికంగా చితికిపోయారు. కానీ ఈ ఎపిసోడ్ ని మాత్రం వీలున్నప్పుడల్లా సన్నిహితుల దగ్గర, పాత్రికేయుల దగ్గర ఆయన గుర్తు చేసుకుంటూనే ఉండేవారు.
(కాంతారావు ఆత్మకథ అనగనగా ఒక రాజకుమారుడు లోంచి)