సినిమా తరవాత సినిమా.. అనే కాన్సెప్టుని పూర్తిగా పక్కన పెట్టేశాడు ఎన్టీఆర్. టెంపర్ తరవాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్నకు ప్రేమతో సినిమాలో పడిపోయాడు. ఆ వెంటనే జనతా గ్యారేజీ పనులు మొదలెట్టేశాడు. జనతా గ్యారేజీ తరవాత ఏం చేయాలో ఇప్పుడే స్కెచ్చులు వేసుకొంటున్నాడు. తన కోసం కథలు సిద్ధం చేయమని దర్శకుల్ని పురమాయిస్తున్నాడు. హిట్టో, ఫట్లో.. మంచో చెడో ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమా తరవాత సినిమా వదలాలన్నది ఎన్టీఆర్ కొత్త పాలసీ. అందుకే ఎన్టీఆర్ కోసం కొత్త కథలు పుడుతున్నాయి. దర్శకులు కూడా ఎన్టీఆర్తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ప్రస్తుతం జనతా గ్యారేజీ పనుల్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ తరవాత కూడా ఊపిరి సలపనంత బిజీనే. ఎన్టీఆర్ కోసం పూరి ఓ కథ సిద్దం చేస్తున్నాడు. వక్కంతం వంశీ ఎప్పట్నుంచో ఎన్టీఆర్ కోసం వెయిటింగ్. ఇప్పుడు హను రాఘవ పూడి కథకూ ఎన్టీఆర్ ఫ్లాటైపోయాడు. అంటే జనతా గ్యారేజీ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ చేయడానికి మూడు కథలు సిద్దంగా ఉన్నాయన్నమాట. మరోవైపు ఎస్.ఎస్.రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేసే సౌలభ్యం ఉన్న దర్శకుడే. వంశీపైడిపల్లి కూడా ఎన్టీఆర్ పిలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఐదుగురు దర్శకులు సిద్దంగా ఉన్నారన్నమాట. ప్లానింగ్ అంటే ఇదీ… ఈ విషయంలో మిగిలిన హీరోలతో పోలిస్తే.. ఎన్టీఆర్ మహా దూకుడుగా ఉన్నట్టే లెక్క.