రవితేజతో పవర్తీసి హిట్టు కొట్టిన దర్శకుడు బాబి. వెంటనే సర్దార్ గబ్బర్‌సింగ్‌లో అవకాశం వచ్చింది. ఇంకేముంది? డాలీ జాతకం తిరగబడింది.. ఇక తుక్కు రెగ్గొట్టేస్తాడు, టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతాడు.. అని మహా ఇదిగా చెప్పుకొన్నారు. అయితే… సీన్ రివర్స్ అయ్యింది. ఆ సినిమా కి పేరుకే ఆయన దర్శకుడు. కర్త కర్మ క్రియ అన్నీ పవన్ కల్యాణే చూసుకొన్నాడు. అంతేకాదు.. మరో ఇద్దరు ఘోస్ట్ డైరెక్టర్లూ ఈ సినిమాకి పనిచేశారన్న గాసిప్పులు వినిపించాయి. దానికి తగ్గట్టే ఆ సినిమా కలగూర గంపలా తయారైంది. సర్దార్ ఫ్లాప్ అయినా..బాబిని ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటే ఈ సినిమాకోసం బాబి చేసిందేం లేదు.. అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి. ఆ ఫ్లాప్ మొత్తం పవన్ కల్యాణ్ ఎకౌంట్లో క్రెడిట్ అయిపోయింది.
ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు బాబి. అసలు ఈ ఆఫర్ బాబికి రావడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎన్టీఆర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బాబి అప్పుడే ఫ్లాప్ ఇచ్చాడు. ఇద్దరికీఎలా కుదిరిందబ్బా అనుకొన్నారు. ఎలాగైతే ఏంటి? ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టేశాడు బాబి. అయితే… ఇప్పటికీ బాబి డమ్మీ దర్శకుడే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కెమెరామెన్, ఎన్టీఆర్ ఇద్దరూ కలసి.. సినిమాలో తెగ ఇన్వాల్వ్ అవుతున్నారని, వాళ్లే దాదాపుగా డైరెక్షన్ కూడా చేసేసుకొంటున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇది బాబి సొంత కథ కాదని, ఓ హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ అనే టాక్ కూడా మొదలైంది. ఎవరు ఎన్ననుకొన్నా, ఎన్ని పుకార్లు వచ్చినా సినిమా విడుదల వరకే.సినిమా బాగుంటే అందరితో పాటు బాబినీ మోసేస్తారు. లేదంటే… ”పాపం.. బాబిని డెరక్షన్ చేయనివ్వలేదేమో” అంటూ జాలి చూపిస్తారు. రెండూ… బాబికి బెటర్ ఆప్షన్లే కదా.