తమ అభిమాన హీరోని ప్రత్యేక్షంగా చూడాలని అందరి ఫ్యాన్స్ కి వుంటుంది. ప్రీరిలీజ్ ఈవెంట్స్ కోసం అభిమానులు ఎదురుచూసేది ఇందుకోసమే. కొత్త సినిమా రిలీజ్ సమయంలోనైనా తమ హీరోని చుడాలనే నిరీక్షణలో వుంటారు ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ నిరీక్షణ కొన్నాళ్ళుగా ఫలించలేదు. ఎంతగానో ఊరించిన దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ అనుకున్నట్లు జరగలేదు. దాదాపు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వేడుకల్లో కనిపించలేదు. అభిమానులని కలవలేదు. దీంతో అభిమానుల్లో ఒకరకమైన నిరాశ కనిపించింది. కొందరు పాదయాత్రలు చేసి ఎన్టీఆర్ ని చూడటానికి తరలిరావడం మొదలైయింది. దీంతో ఎన్టీఆర్ నుంచి ఓ ప్రత్యేకమైన ప్రకటన వచ్చింది.
తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్, తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని స్పష్టం చేశారు.