ఎన్టీఆర్ అభిమానుల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉంది: సుకుమార్
ఎన్టీఆర్ సినిమా అంటే.. తన సినిమా అనుకొనేంత సంబరపడిపోతుంటాడు సుకుమార్. నాన్నకు ప్రేమతో సినిమా నుంచీ.. వీళ్లిద్దరి మధ్య బంధం బలపడింది. ఎన్టీఆర్ ఫంక్షన్ అంటే సుకుమార్ టంచనుగా హాజరైపోతుంటాడు. తన స్పీచ్‌తో ఫ్యాన్స్‌కి మత్తెక్కిస్తాడు. జై లవకుశ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కీ సుకుమార్ గెస్ట్‌గా వచ్చాడు. అయితే ఈ సందర్భంగా ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. ‘ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో చీలిక ఏర్పడే ప్రమాదం ఉంది’ అంటూ.. స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ సినిమాలో జై, లవ, కుశ అనే మూడు పాత్రలున్నాయి కదా? ఒక్కో పాత్రనీ ఒక్కొక్క వర్గం వెనకేసుకొస్తుందని చమత్కరించాడు సుకుమార్.
”ఎన్టీఆర్ ఓ సముద్రం. మేమంతా ఓ చెంచాడు, బిందెడు నీళ్లు తోడుకొన్నాం. ఈ సినిమాతో బాబి ఓ ట్యాంకర్ తోడుకొన్నాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఈ సముద్రానికే సాధ్యం” అన్నాడు సుకుమార్.
ఎన్టీఆర్‌కి నేషనల్ అవార్డు వస్తుంది: కల్యాణ్ రామ్
మూడు పాత్రల్లో విజృంభించడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. జై లవకుశలో ఎన్టీఆర్ పెర్‌ఫార్మ్సెన్స్ చూసి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. కల్యాణ్ రామ్ అయితే ఇంకా ఇంకా… హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాపై కల్యాణ్‌రామ్‌కి నమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఆర్థిక లాభాల్ని అటుంచితే నటుడిగా ఎన్టీఆర్‌కి ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని కల్యాణ్ రామ్ చెబుతున్నాడు. అంతేకాదు… ఈ సినిమాతో ఎన్టీఆర్‌కి నేషనల్ అవార్డు కూడా రావడం ఖాయమని జోస్యం చెప్పాడు.
”ఎన్టీఆర్‌కి ఇప్పటి వరకూ చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో నేషనల్ అవార్డు తెచ్చుకొంటాడు. అంత గొప్పగా నటించాడు. నేషనల్ అవార్డు వచ్చిన తరవాత మళ్లీ ఇలా గొప్ప ఫంక్షన్ చేసుకొందాం” అంటూ అభిమానుల్ని ఉత్సాహపరిచాడు కల్యాణ్ రామ్. ”డబ్బున్న చోట ఎమోషన్స్ ఉండవు. నాకూ, తారక్కీ డబ్బు ముఖ్యం కాదు. అనుబంధం గొప్పది. నాకు డబ్బు కేవలం పేపర్ లాంటిది. అభిమానుల్ని సంతోషపెట్టే సినిమా చేద్దామనుకొన్నాం. కథని నమ్మి ఈసినిమా తీశాం. బాబికి దర్శకుడిగా ఆఫర్ ఇస్తున్నప్పుడు అందరూ సందేశించారు. బాబి కంటే పెద్ద దర్శకుడు రాడా?? అని ఆక్షేపించారు. కానీ నేనూ, మా తమ్ముడు కథని నమ్మాం. ఓ గొప్ప సినిమా అందిద్దామనుకొన్నాం. అదే చేశాం” అన్నాడు కల్యాణ్ రామ్.
ఆ ఇద్దరి పేర్లు ‘లవకుశ’ హిట్ అయ్యాక చెబుతాడట : ఎన్టీఆర్
”జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మరో జన్మ ఉంటే అది వాళ్లకోసమే. ఈ జన్మ మాత్రం అభిమానులకు అంకితం.. వాళ్లతోనే ఉండిపోతా” అంటూ ఎమోషనల్ స్సీచ్ ఇచ్చాడు ఎన్టీఆర్. కాసేపటి క్రితం హైదరాబాద్‌లో జై లవకుశ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ”మంచి భర్తగా, మంచి కొడుకుగా, మంచి తమ్ముడిగా ఉండడానికి ప్రయత్నిస్తా. కానీ.. అభిమానుల దగ్గర మాత్రం ఆ ఎమోషన్ అలానే ఉంఉటంది. మీకోసం రక్తం ధారబోస్తా” అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు ఎన్టీఆర్.
జై లవకుశ గురించి చెబుతూ ”నాన్నకు ప్రేమతో సినిమా చేయడానికి టెంపర్, జనతా గ్యారేజ్ లో నటించడానికి నాన్నకు ప్రేమతో స్ఫూర్తి నిచ్చాయి. జనతా గ్యారేజ్ స్ఫూర్తితో చేసిన సినిమా జై లవకుశ. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. నేనూ అన్నయ్య కలిసి ఓ సినిమా చేద్దామనుకొన్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. కానీ… అన్నదమ్ములిద్దరూ కలసి గొప్ప సినిమా తీశార్రా అని అభిమానుల చేత అనిపించాలని, వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని అనిపించింది. ఆ మాటలు దేవుడు విని బాబిని మా దగ్గరకు పంపాడేమో. బాబి చెప్పిన కథ బాగా నచ్చింది. కానీ.. ఎలా చేయాలో అర్థం కాలేదు. ఈ కథని నాకు అత్యంత ఆప్తులైన ఇద్దరితో పంచుకొన్నా. వాళ్లకూ బాగా నచ్చింది. వాళ్లెవరన్నదీ ఈ సినిమా హిట్ అయ్యాక చెబుతా” అన్నాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ స్పీచ్ లో ఈ సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ కనిపించింది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. అందులో ఉన్న డోసే సినిమాలోనూ ఉంటే.. ఇక ఈ దసరా ఎన్టీఆర్ పేరున లిఖించేయొచ్చు.