ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజీ షూటింగ్ స్పీడు స్పీడుగా సాగిపోతోంది. అన్నీ అనుకొన్నట్టు జరుగుతున్న సమయాన… ఓ చిన్న షాక్. జనతా గ్యారేజ్‌లో అనూహ్యమైన మార్పు సంభవించింది. వివరాల్లోకి వెళ్తే… ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి పెదనాన్నగా మోహన్‌లాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా ఒకప్పటి కథానాయిక దేవయానిని తీసుకొన్నారు. ఎన్టీఆర్ సినిమా అనగానే ఆమె కూడా సంతోషంగా వచ్చి.. కాల్షీట్లు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు దేవయాని ఈ సినిమా నుంచి తప్పుకొంది.
దేవయాని – మోహన్‌లాల్ మధ్య కొన్ని సన్నివేశాల్ని ఇటీవల తెరకెక్కించారు. తీరా రషెష్ చూస్తే.. మోహన్‌లాల్ నటనకు, దేవయాని నటనకు ఏమాత్రం సరితూగలేదని అనిపించందట. దేవయాని మిస్ మ్యాచ్ అవుతోందని, అలాగైతే సన్నివేశాలన్నీ తేలిపోతాయని చిత్రయూనిట్ భయపడింది. అందుకే.. దేవయానిని అర్థాంతరంగా తొలగించారని టాక్. ఆమె స్థానంలో సుహాసినిని తీసుకొన్నారట. ఆమె అయితే.. తన అనుభవంతో మోహన్లాల్కి దీటుగా నటిస్తుందని చిత్రబృందం ఆలోచన. ఒకట్రెండు రోజుల్లో సుహాసిని చిత్రబృందంతో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. దేవయాని పుణ్యమా అని.. జనతా గ్యారేజ్ రీ షూట్లో పడింది. దేవయాని సన్నివేశాల్ని సుహాసినితో తెరకెక్కించబోతున్నారు.