బడ్జెట్ చేయి దాటిపోవడం అన్నది సినిమాలకు పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. ప్లానింగ్ సరిగా లేకపోవడం ఒక ఎత్తయితే, అనుకొన్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడం మరో కారణం. దాంతో అనుకొన్న బడ్జెట్లో సినిమా పూర్తి అవ్వడం ఓ అద్భుతంలా మారిందిప్పుడు. తన సినిమా బడ్జెట్ విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ కేర్‌ఫుల్‌గానే ఉంటాడు. అయితే నాన్నకు ప్రేమతో బడ్జెట్ క్రాస్ అయిపోయింది. అంత హిట్టొచ్చినా… బొటాబొటీగా లాభాలు సంపాదించుకొందంటే దానికి కారణం.. అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కవ అయిపోవడమే. అందుకే జనతా గ్యారేజ్ విషయంలో చాలా పక్కాగా ఉండాలని దర్శక నిర్మాతలకు ముందే చెప్పాడు. `ఈ సినిమా ఇంతలోనే తీయాలి` అంటూ ఓ అంకె కూడా చెప్పాడట. దానికి కొరటాల శివ కూడా ఓకే అన్నాడట. అయితే… ఇప్పుడు జనతా గ్యారేజీ బడ్జెట్ కూడా చేయి దాటి పోవడంతో ఎన్టీఆర్ ఆందోళన చెందుతున్నాడని టాక్,
మరో 30 శాతం టాకీ, పాటలు, ప్రచార వ్యవహారం ఇవన్నీ మిగిలి ఉండగానే… జనతా గ్యారేజీ బడ్జెట్ దాటేసిందట. తప్పు ఎక్కడ జరిగిందన్న విషయంలో ఎన్టీఆర్ అండ్ కో తర్జన భర్జనలు పడుతోందట. ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యమీనన్ ఇలా.. స్టార్ కాస్టింగ్ కి కొదవలేని సినిమా ఇది. సాంకేతికంగానూ సౌండ్ పార్టీలే పనిచేస్తున్నాయి. దానికి తోడు కొరటాల పారితోషికం 8 కోట్ల పైమాటే. పారితోషికాలకే డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. దానికి తోడు ఈ సినిమా కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారు. దాని ఖరీదు దాదాపు రూ.4 కోట్లని తెలుస్తోంది. ఆగస్టు 12న ఈ సినిమాని విడుదల చేయాలన్న ఉద్దేశంతో రెండు షిఫ్టులతో షూటింగ్ చేశారు. దాంతో ప్రొడక్షన్ ఖర్చులు డబుల్ అయ్యాయి. సో.. అలా బడ్జెట్ పెరిగిపోయింది. ఇప్పుడైనా.. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోమని ఎన్టీఆర్సూచించాడట. ఆర్భాటలకూ పోకుండా తక్కవ ఖర్చుతోనే సినిమాని నీట్‌గా తీయమని చెప్పాడట. మరి ఈ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ ఎంతకు తేలుతుందో..