నిన్నామొన్నటిదాకా ఎన్టీఆర్ అంటే టీడీపీ సొత్తు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్టీఆర్ అంటే అందరి వాడు. ఏపీలో వైసీపీ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజును నిర్వహించింది. విజయవాడతో పాటు పలు చోట్ల నేతలు ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామని ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు ఆదేశాలిచ్చారో లేకపోతే.. తమ అభిమానం మేరకు పోస్టర్లు.. ఫ్లెక్సీలు వేసుకున్నారో స్పష్టత లేదు.
ఇక అక్కడక్కడా బీజేపీ నేతలు కూడా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పుట్టిన రోజును గుర్తు చేసుకున్నారు. ఇక తెలంగాణలో పార్టీలకు అతీతంగా అందరూ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరే కాదు హైదరాబాద్లో పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి మరీ నివాళులు అర్పించారు. ఇలా నివాళులు అర్పించిన వారిలో కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.
ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి ఉండటం వల్ల ఇప్పటి వరకూ ఆ పార్టీ సొత్తే అన్నట్లుగా ఉండేవారు. ఇతర పార్టీల నేతలకు అభిమానం ఉన్నా.. తాము నివాళులు అర్పిస్తే… తమ పార్టీలో చులకన అయిపోతామేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బెరుకుపోయింది. వైసీపీ నేతలు కూడా ఎన్టీఆర్ జపం చేస్తున్నారు . టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ అందరి వాడని చెబుతున్నారు.