`జనతా గ్యారేజ్` తరవాత ఎన్టీఆర్ – కొరటాల శివ మరోసారి కలసి పని చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. `ఆచార్య` అవ్వగానే.. ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కబోతోంది. గాడ్ ఫాదర్ టైపు కథని `జనతా గ్యారేజ్` గా మార్చి, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ చేర్చి తీశాడు కొరటాల. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసారి.. ఎన్టీఆర్ కోసం పొలిటికల్ డ్రామాని సిద్ధం చేస్తున్నాడని సమాచారం. మహేష్ తో తీసిన `భరత్ అనే నేను` పొలిటికల్ డ్రామానే. ఓ ముఖ్యమంత్రి సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాడన్నది `భరత్ అనే నేను` పాయింట్. అయితే ఈసారి.. రాజకీయాల్ని మరో కోణంలో చర్చించబోతున్నాడని సమాచారం. ఓ సామాన్యుడు తలచుకుంటే ఏం చేయగలడో.. ఈసారి చూపించబోతున్నాడట. కొరటాల బలం.. భావోద్వేగాలే. ఈసారీ ఈ కథలో అవి ప్రధానమైన పాత్ర పోషించబోతున్నాయట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తీస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. కథానాయిక, ప్రతినాయకుడు… ఈ పాత్రల కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలైపోయాయని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఓ కథానాయిక ని బాలీవుడ్ నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది.