తెలుగు రాజకీయ చరిత్రలో నందమూరి తారకరామారావు ప్రయాణం ఓ చరిత్ర, ఓ సంచలనం! సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, తొమ్మిది నెలల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఇదంతా ఎన్టీఆర్ మహానాయకుడులో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ రాజకీయ విజయంలో చైతన్యయాత్ర ముఖ్యమైనది. చైతన్యరథంపై ప్రతి పల్లె, పట్నం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ, ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ చైతన్యరథయాత్రలో ప్రజలతో ఎన్టీఆర్ మమేకమయ్యారు. చైతన్యయాత్రలో చైతన్య రథసారథిగా హరికృష్ణ పాత్ర కూడా విస్మరించలేనిది. ప్రస్తుతం ఎన్టీఆర్ మహానాయకుడులో నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా చైతన్యయాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. సినిమాలో ఈ సన్నివేశాలు హైలైట్ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కానున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.