ఓ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయడంలో ఉన్న కష్టనష్టాలేంటో ‘ఎన్టీఆర్‌ని’ చూస్తే అర్థమవుతోంది. ‘కథానాయకుడు’ హిట్టై, మంచి డబ్బులొస్తే.. `మహానాయకుడు`ని ఎప్పుడు విడుదల చేద్దామా అని చిత్రబృందానికి, దాన్ని ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అని ప్రేక్షకులకూ ఉత్సుకత ఉండేది. బాక్సాఫీసు దగ్గర ‘కథానాయకుడు’ ప్రభావం చూపించకపోవడంతో – ‘మహానాయకుడు’పై ఎలాంటి ఆసక్తీ లేకుండా పోయిందిప్పుడు. దానికి తోడు చిత్రబృందం కూడా ‘విడుదల చేద్దాంలే.. తప్పుతుందా’ అన్నట్టు వ్యవహరిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటి వరకూ చిత్రబృందం ఓ క్లారిటీ ఇవ్వలేదు. ఫిబ్రవరి 7 తరవాత 15కి వెళ్లింది, ఇప్పుడు 21 అంటున్నారు. కానీ… ఈ విషయంలో ఎవరూ స్పందించడం లేదు.
‘కథానాయకుడు’ విడుదలయ్యే సమయానికి ‘మహానాయకుడు’కి సంబంధించి 12 రోజుల షెడ్యూల్ బాకీ ఉంది. ‘కథానాయకుడు’ 9న విడుదలైతే 12నే `మహానాయకుడు` షూటింగ్ మొదలెట్టేశారు. అంటే.. ఈపాటికి ‘మహానాయకుడు’ పూర్తవ్వాలి. కానీ ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. మధ్యమధ్యలో బ్రేకులు పడడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. తీయాల్సిన కొన్ని సన్నివేశాల్ని సైతం.. కుదించేస్తున్నారని వినికిడి. భారీ జన సందోహం మధ్య కొన్ని షాట్స్ తీయాల్సివుంది. వాటిని బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశ్యంతోనో, తొందరగా చుట్టేయాలన్న ఆలోచనతోనో పైపైనే కానిచ్చేస్తున్నార్ట. పైగా ‘కథానాయకుడు’ రిజల్ట్ చిత్రబృందానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాన్నుంచి తేరుకోవడం కష్టం. అందుకే `ఎలాగోలా పూర్తి చేస్తే చాలు `అనుకుంటూ మిగిలిన షూటింగ్‌ని నెట్టుకొస్తున్నారని సమాచారం. ఈనెలాఖరు వరకూ చిత్రీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఆ తరవాతే చిత్రబృందం విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇస్తుంది.