మా ఎన్నికలు ఈసారి హోరా హోరీగా జరగబోతున్నాయి. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని అటు మంచు విష్ణు, ఇటు ప్రకాష్‌రాజ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఊర్లో లేని వాళ్లని కూడా రప్పించి, వాళ్లతో ఓటింగ్ వేయించాలన్నది ఆలోచన. అసలు ఇల్లు దాటి బయటకు రాని వాళ్ల కోసం బ్యాలెట్ ఓట్ ఎలాగూ ఉంది. అయితే `మా`లో పోలింగ్ శాతం ఎప్పుడూ 50 శాతం కూడా లేదు. మహా అయితే 400 ఓట్లు పోలవుతాయంతే. స్టార్ హీరోలు పోలింగ్ వేసిన దాఖలాలు చాలా తక్కువ. ఈసారి కూడా.. స్టార్ హీరోలు చాలా వరకూ `మా` ఎన్నికలకు, ఓటింగ్ కి దూరంగానే ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, మహేష్, పవన్, చరణ్, ప్రభాస్ వీళ్లెవరూ, ఎప్పుడూ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈసారి కూడా వీళ్లకు `మా` ఓటింగ్ పై ఇష్టం లేనట్టు తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున జీవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్యానల్ కి ఓటేయాల్సిందిగా.. జీవిత పెద్ద పెద్ద హీరోలకు ఫోన్లు చేస్తున్నారామె. అందులో భాగంగా జీవిత ఎన్టీఆర్‌కి ఫోన్ చేస్తే… `ఈసారి ఓటింగ్ కి దూరంగా ఉండాలనుకుంటున్నా` అన్నార్ట. ఈ విషయాన్ని జీవితనే స్వయంగా చెప్పారు. `మా`లో జరుగుతున్న రాద్ధాంతం స్టార్ హీరోలకు నచ్చడం లేదని, అందుకే వాళ్లలో ఎవరూ ఓటింగ్ కి రావడం లేదని సమాచారం. పైగా.. దాదాపుగా స్టార్ హీరోలంతా షూటింగులతో బిజీగా ఉంటున్నారు. కొంతమంది ఔట్ డోర్లో ఉన్నారు. వాళ్లంతా మా ఎన్నికల కోసం వస్తారనుకోవడం అత్యాశే. పెద్ద పెద్ద హీరోలు మా రాజకీయాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్లకంత సమయం, ఆసక్తి రెండూ లేవు. `మా`లో ఎవరుంటారయ్యా? అని అడిగితే – అరకొర అవకాశాలున్నవాళ్లు, అవకాశాల్లేక ఖాళీగా ఉన్నవాళ్లు మాత్రమే. ఓటింగ్ వేసేది… సాదా సీదా సినీ నటీనటులు. అంతే. ఈసారీ అందులో మార్పు లేకపోవొచ్చు.