ఎట్టకేలకు ఎన్టీఆర్ అవార్డులకు మోక్షం వచ్చింది. ఐదేళ్ల నుంచీ ఈ అవార్డులను పట్టించుకోని ఏపీ సర్కార్ ఇన్నాళ్లకు కళ్లు తెరిచింది. ఒకేసారి రెండేళ్ల (2012, 2013)లకు సరిపడా అవార్డులు ఇచ్చేసింది. మరో మూడేళ్లు బాకీ పడింది. త్వరలోనే 2014, 15. 16 అవార్డులనీ ఇచ్చి తీరతాం… అని అవార్డు కమిటీలో ఉన్న మురళీ మోహన్ సెలవిచ్చారు. ఈసారి అవార్డులు ఎస్పి బాలసుబ్రమణ్యం, హేమామాలినిలకు వరించాయి. సింగీతం, కోదండరామిరెడ్డి, సురేష్‌బాబు, దిల్‌రాజు, కోడిరామకృష్ణ, వాణిశ్రీలకూ అవార్డులు దక్కాయి. అంతా బాగానే ఉంది. ఇందులో హేమామాలినీ తప్ప.. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న కళాకారులేరి? జాతీయ అవార్డు పేరుకేనా? మనం మనం పంచుకొనేదైతే జాతీయ అవార్డు అనే పేరెందుకు? సింగీతం, కోదండరామిరెడ్డి, వాణిశ్రీ, కోడిరామకృష్ణ.. వీళ్లంతా అవార్డులకు అర్హులే. ఇది కాదనలేని సత్యం. అయితే.. ఈ అవార్డుల ఖ్యాతి పెరగాలంటే జాతీయ స్థాయిలో ప్రతిభావంతుల్ని వెదికి పట్టుకోవాలి. ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఇది వరకు దిలీప్‌కుమార్, లతామంగేష్కర్, శివాజీగణేశన్, రాజ్‌కుమార్, వహీదా రెహమాన్.. ఇలాంటి హేమాహేమీలకు వరించింది. అదే స్థాయి ఇక ముందూ చూపిస్తే బాగుంటుందేమో..? ముందు అవార్డులు మన వాళ్లకు ఇచ్చుకోవాలి.. ఆ తరవాతే పరాయి వాళ్లకు అనేదే అవార్డుల ఉద్దేశం అయితే ఎవ్వరూ కాదనరు. అసలు ఈ చర్చే అనవసరం.
మరో ముఖ్య విషయం ఏమిటంటే… ఈ జాతీయ అవార్డుల్ని నంది అవార్డులతో ముడిపెట్టడం. అదే వేదికపై అవార్డులను ప్రదానం చేయాలనే నిర్ణయం తీసుకోవడం. ఐదేళ్ల నందీ అవార్డులు. ఎన్టీఆర్ అవార్డులు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డులు, బిఎన్‌రెడ్డి అవార్డులు, రఘపతి వెంకయ్య అవార్డులూ.. ఇలా అన్నీ ఒకేసారి ఇవ్వడంతో అవార్డుల ప్రాధాన్యం తగ్గిపోవడం ఖాయం. అసలే ఎప్పటి అవార్డులో ఇవి. దాన్నీ గుంపులో గొవింద వ్యవహారంలా మార్చేస్తున్నారన్నమాట. అవార్డులు ఇచ్చేశాం.. మా పనైపోయింది అనుకొంటే సరిపోతుందా? దానికో ప్రణాళిక అవసరం లేదా? 2014, 15, 16 నంది అవార్డుల్ని ఇంకా ప్రకటించలేదు. అవి పూర్తయ్యాక మళ్లీ జాతీయ అవార్డుల లిస్టు విడుదల చేయాలి. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? అవార్డులు ఎప్పుడు ఇస్తారు? చూస్తుంటే ఈజీగా మరో యేడాది గడిచిపోయేట్టుంది.