ఎన్టీఆర్ తదుపరి సినిమాకి దర్శకుడెవరు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ కోసం పలువురు దర్శకులు కథలు సిద్దం చేస్తుండడం, ఎన్టీఆర్ కూడా ఆచి తూచి అడుగేయాలని భావిస్తుండడంతో.. ఆ ఉత్కంఠత మరింత పెరుగుతోంది. లింగుస్వామి, త్రివిక్రమ్‌ల పేర్లు కూడా పరిశీలనకు రావడం, కొత్త దర్శకులు కూడా ఎన్టీఆర్‌ని సంప్రదిస్తుండడంతో ఇంత వరకూ ఈ విషయంలో ఓ క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ కోసం పూరి రెండు కథలు సిద్దం చేసినా, ఇజం విడుదలయ్యేంత వరకూ వేచి చూడాలని ఎన్టీఆర్ భావించాడు. అయితే మరీ కాలయాపన చేయడం అనవసరం అనుకొన్నాడో, లేదంటే ఇజం సినిమాపై నమ్మకం పెంచుకొన్నాడో తెలీదు గానీ… ఎన్టీఆర్ పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. గత రెండ్రోజులుగా పూరి – ఎన్టీఆర్ లమధ్య కథా చర్చలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని, ఎట్టకేలకు పూరికి ఎన్టీఆర్ పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. ఇజం రిపోర్ట్‌తో ఎలాంటి సంబంధం లేకుండా తనకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పూరి ఫుల్ హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ కాంబినేషన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇజం రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఎనౌన్స్ చేస్తే, ఇజం పబ్లిసిటీకీ కూడా పనికొస్తుందని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తాడా, లేదంటే నిర్మాత మారే అవకాశాలున్నాయా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సివుంది.