ఈ సంవత్సరం దీపావళికి వచ్చిన తమిళ సినిమా వేదళం అక్కడ కాసుల వర్షం కురిపించింది… ఓ వైపు చెన్నై వర్షంతో భీకరమైన పరిస్థితి నెలకొన్నా అజిత్ ఖలేజాతో సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అటు తమిళ్ తో పాటుగా ఒకేసారి తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తారనుకున్నా అది కాస్త ఆగిపోయింది. తెలుగు టైటిల్ ‘ఆవేశం’ అంటూ పోస్టర్స్ కూడా విడుదల చేసిన నిర్మాత ఏ.ఎం.రత్నం తర్వాత ఈ సినిమాను ఇక్కడ స్టార్ హీరోతో రీమేక్ చేద్దామనే ఆలోచనలో దాన్ని ఆపేశారు.
ఆ దారిలోనే మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు సినిమాలో హీరోగా చేయించే ప్రయత్నం చేశాడట. అయితే చిరంజీవి విషయం ఏమో తెలియదు కాని ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ సినిమా బాగుంది అనడంతో అంతా ఇక జూనియర్ ఈ సినిమా చేయడం ఖాయమనుకున్నారు. కాని ఎన్టీఆర్ వేదళం సినిమాను చేసేందుకు సుముఖంగా లేడట. తను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఊసరవల్లిలో కాస్త హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రేక్షకులు తిప్పి కొట్టారు.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరోయిన్ బదులు సిస్టర్ సెంటిమెంట్ పెట్టి నడిపించాడట దర్శకుడు శివ. ఒకవేళ ఎన్టీఆర్ ఈ సినిమా తీస్తే ఊసరవల్లి కి సీక్వెల్ గా ఉంటుందని భావించి వెనక్కి తగ్గాడట. అదీగాక వరుసెంట సినిమాలతో తన డేట్స్ కూడా ఖాళీలేవని చెబుతున్నాడట. రిలీజ్ టైంలో అజిత్ వేదళం చిరంజీవి, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా తీస్తారనే ఊపు కనపడ్డా ఇప్పుడు ఇద్దరు చల్ల బడ్డారని తెలుస్తుంది. అసలు ఇంతకీ తెలుగు రీమేక్ ఉంటుందా లేక యధావిధంగా అజిత్ సినిమానే ఆవేశంగా విడుదల చేస్తారా అనేది కొద్దిరోజుల్లో తేలిపోతుంది.