ఓ స్టార్ హీరోకి కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అసలు టైమ్ ఇస్తేనే కదా?
స్టార్ హీరోల కళ్లెప్పుడూ పెద్ధ పెద్ధ దర్శకులపైనే ఉంటాయి. లేదంటే ఓ సీడీ చేతికిచ్చి.. `సేమ్ టూ సేమ్ దించేద్దాం` అంటాడంతే. హీరో దర్శకుల వెంట పడడం.. కథలు చెప్పండి అంటూ ఆఫర్లు ఇవ్వడం, కొత్త దర్శకులకూ ఫోన్లు చేసి కథలున్నాయా అని అడగడం.. ఈమధ్య కాలంలో వింతే. ఆ వింతని నిజం చేస్తున్నాడు ఎన్టీఆర్.
జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్‌కి కాన్ఫిడెన్స్ తో పాటు కాస్త కన్ఫ్యూషన్ పెరిగింది. అందుకే ఏ కథతో వెళ్లాలి? ఏ దర్శకుడ్ని నమ్మాలి అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ వినినన్ని కథలు… తన కెరీర్ మొత్తం మీద వినలేదేమో?? తనకు పరిచయం ఉన్న ప్రతీ దర్శకుడ్నీ పిలిచి `కథలుంటే చెప్పు` అంటూ ఆఫర్ ఇవ్వడం ఆశ్చర్య పరిచే విషయమే. పాతిక సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ నుంచి.. నిన్న మొన్నోచ్చిన అనిల్‌రావిపూడి వరకూ ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌కి ఎనిమిదిమంది దర్శకులు కథలు వినిపించారు. ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్ ఆఫీస్ ఇప్పుడు దర్శకుల రాకపోకలతో కిటకిటలాడిపోతోంది. ఇంతమంది దర్శకులు వచ్చినా…. ఇంకా ది బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయా అని చూస్తున్నాడట. ఆనందకరమైన విషయం ఏమిటంటే… ఎన్టీఆర్ ప్రయారిటీ ఇప్పుడు దర్శకుడు కాదు.. కథ! ఎవరు మంచి కథ చెబితే… వాళ్లతో ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నాడట. ప్రేమమ్ దర్శకుడు చందూ మొండేటికీ ఎన్టీఆర్ కథచెప్పమంటూ ఫోన్ చేశాడని టాక్. పాత పరిచయాల కొద్దీ సురేందర్ రెడ్డినీ కలిశాడని చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కథలు వినే మూడ్‌లో ఉన్నాడిప్పుడు. చెప్పలేం… ఏ కథ ఎన్టీఆర్‌ని డిస్ట్రబ్ చేస్తుందో. అప్పటి వరకూ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓపిక పట్టాల్సిందే.