ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే లొకేషన్ రెక్కీ పూర్తయ్యింది. నటీనటుల ఎంపిక కూడా వేగవంతం అయ్యింది. ఈ సినిమా కోసం మలయాళం నుంచి బీజూ బీనన్‌ని, టోవినో థామస్‌ని ఎంచుకొన్నారు. కథానాయికగా రుక్మిణి వసంత్ ఖరారు అయ్యింది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరిగిపోయింది. వాళ్ల వివరాలు ఒకొక్కటిగా బయటకు వస్తాయి.
ఈ సినిమా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. మయన్మార్, థాయ్ లాండ్, లాయిస్లను కలిపి భౌగోళికంగా గోల్డెన్ ట్రయాంగిల్ అనిపిలుస్తాయి. ఇక్కడి నుంచి కొకైన్, గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుంటుంది. డ్రగ్ సామ్రాజ్యానికి అదో స్వర్గం లాంటిది. అక్కడ జరిగే అరాచకాలు, అక్రమాల నేపథ్యంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల సినిమా నడుస్తుందని సమాచారం. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈనెలాఖరున షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందు లుక్ టెస్ట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకొన్నాడు. స్వతహాగా పోస్ట్ ప్రొడక్షన్ కి ప్రశాంత్ నీల్ ఎక్కువ సమయం తీసుకొంటాడు. అందుకే ఆగస్టులోగా షూట్ పూర్తయితే, పోస్ట్ ప్రొడక్షన్ కి కనీసం 4 నెలలు దొరుకుతుంది. అది ప్రశాంత్ నీల్‌కు సరిపోతుంది. 2026 జనవరికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.