ఎన్టీఆర్ సినీ జీవితంలో అద్భుతమై సినిమాలెన్నో. ఆయన చేయని పాత్ర లేదు. వేయని వేషం లేదు. జానపదం, సోషియో ఫాంటసీ, పౌరాణికం, సోషల్ డ్రామా… ఇలా ఏదీ వదల్లేదు. కాకపోతే.. కౌబోయ్ తరహా సినిమా మాత్రం చేయలేదు. దానికి కారణం.. కృష్ణ. ఆయన తీసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలియాంటే 1970ల్లోకి వెళ్లిపోవాల్సిందే.
అప్పట్లో మాస్ హీరో అంటే.. ఎన్టీఆరే. యాక్షన్ కథలన్నీ ఆయన దగ్గరకే వెళ్లేవి. మిగిలిన హీరోలు ఫ్యామిలీ డ్రామాలవైపు మొగ్గు చూపించేవారు. కృష్ణకు ఓ యాక్షన్ సినిమా చేయాలని బలంగా ఉండేది. రొటీన్ ఫైట్లు లేకుండా.. సెటప్ అంతా కొత్తగా ఉండాలని భావించేవారు. ఆ సమయంలోనే కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశారు. వాటిలో కౌబోయ్ కథలు ఆయన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ స్టైల్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనిపించింది. వెంటనే రచయిత మహారథి ని పిలిపించి, కౌబోయ్ తరహా కథ ఒకటి రాయమని పురమాయించారు. ఆయన కూడా నాలుగైదు కౌబోయ్ సినిమాలు చూసి ‘మోసగాళ్లకు మోసగాడు’ స్క్రిప్టు తయారు చేశారు. ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా అది. కృష్ణ మార్కెట్ కి మించి ఖర్చు చేశారు. సినిమా అంతా పూర్తయ్యాక.. తొలి కాపీని చక్రపాణి కి చూపించాలనిపించింది కృష్ణకు. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్ పై అందరికీ గురి ఎక్కువ. ఆయన హిట్టంటే హిట్టు, ఫ్లాపంటే ఫ్లాపు. చక్రపాణి ఏమైనా సలహాలూ, సూచనలు ఇస్తే, వాటి ప్రకారం రీషూట్లు చేసుకుని హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం.. చక్రపాణి కోసం విజయా స్టూడియోలో ఓ షో వేశారు కృష్ణ.
సినిమా చూశాక.. చక్రపాణి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అదేంటి? ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్లిపోయారు.. అంటూ భయపడిపోయారు కృష్ణ. వెంటనే చక్రపాణికి ఫోన్ చేసి “అదేంటి గురువు గారూ.. అలా వెళ్లిపోయారు. సినిమా ఎలా ఉందో చెప్పలేదు” అంటూ భయం భయంగానే అడిగార్ట. “ఈ సినిమాపై ఎంత ఖర్చు చేశావ్” అన్నది చక్రపాణి మొదటి ప్రశ్న. కృష్ణ అంకె చెప్పారు. “ఆ డబ్బులన్నీ బూడిదలో పోసినట్టే” అంటూ చక్రపాణి అనేసరికి… కృష్ణ గుండెల్లో రాయిపడినంత పనైంది. “అదేం సినిమా? అవేం సెట్లు? ఆ డ్రస్సులేంటి? ఆ ఇల్లేంటి? మన నేటివిటీ ఎక్కడుంది? మనది కాని సినిమా చూపిస్తే ఒక్కడు కూడా చూడడు. ఈ సినిమాని రిలీజ్ చేయడం కూడా అవవసరం” అంటూ ఫోన్ పెట్టేశారు. దాంతో కృష్ణ తల్లడిల్లిపోయారు. చక్రపాణి చెప్పారంటే తిరుగులేనట్టే. మరి ఏం చేయాలి? అన్నది కృష్ణ ఆలోచన.
సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. “బ్రదర్.. మీరు కౌబోయ్ నేపథ్యంలో ఓ సినిమా తీశారు కదా. అది నాకు చూపిస్తారా?” అని.
“చూపించడానికి ఏం లేదు. కానీ ఇప్పుడే చక్రపాణి గారు అక్షంతలు వేశారు. మీ తిట్లు కూడా తినాలేమో అనే భయం నాది” అంటూ కృష్ణ సందేహించారు.
అయితే ఎన్టీఆర్ మాత్రం “మీరు ఓ ప్రయోగం చేశారు. అలాంటి కొత్త సినిమాలు తీసినప్పుడు అంతా ఇలా అనేవాళ్లే. మీరేం కంగారు పడకండి.. నాకు ఒక్కసారి చూపించండి” అనేసరికి.. కృష్ణ కాదలేక, మరుసటి రోజే ఎన్టీఆర్ కోసం ఓ షో వేశారు.
సినిమా అంతా చూశాక.. ఎన్టీఆర్ ఒకే ఒక్క మాట చెప్పార్ట. “ఇక నేను కౌబోయ్ పాత్ర వైపు వెళ్లను” అని.
“అద్భుతంగా చేశారు. నా కెరీర్లో అన్ని రకాల పాత్రలూ చేశాను. కౌబోయ్ కథ కూడా చేయాలనుకున్నా. ఈ సినిమా చూశాక.. నేను అలాంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది అనిపిస్తోంది. ఇక మీదట మిమ్మల్ని జనాలు కౌబోయ్గానూ గుర్తు పెట్టుకుంటారు. కౌబోయ్ అంటే తెలుగు సినిమాకి గుర్తొచ్చేది మీరే. మీ కెరీర్ ఇక నుంచి పెద్ద మలుపు తిరగబోతోంది” అంటూ ఆశీర్వదించార్ట.
ఆయన చెప్పినట్టే.. ‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదలై.. సూపర్ హిట్టయ్యింది. కృష్ణ సినీ జీవితంలో ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. ఈ సినిమాని ఆ తరవాత అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. చెప్పినట్టే ఎన్టీఆర్ కూడా కౌబోయ్ పాత్ర పోషించలేదు.