‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ విచ్చేసి అభిమానుల్లో జోష్ నింపాడు. కల్యాణ్ రామ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనగానే ఎన్టీఆర్ రావడం కొన్నేళ్లుగా పరిపాటిగా మారింది. ఈసారి కూడా ఎన్టీఆర్ వచ్చాడు. సినిమా ప్రమోషన్లకు తన వంతు సహాయం చేశాడు. ఈ సినిమా ఎన్టీఆర్ ఆల్రెడీ చూసేశాడు. ”రాసి పెట్టుకోండి.. ఆఖరి 20 నిమిషాలూ కన్నీళ్లు పెట్టుకొనేలా ఉంటుంది సినిమా. విజయశాంతి గారు లేకపోయినా, ఫృథ్వీ గారు లేకపోయినా, దర్శకుడు ప్రదీప్ లేకపోయినా ఈ సినిమా లేదు. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు” అంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచాడు. ‘అన్నా.. నా కోసం ఒకసారి కాలర్ ఎత్తు..’ అంటూ కల్యాణ్ రామ్‌ని కోరడం, అన్న బదులుగా తానే కాలర్ ఎత్తి.. విజయ సాంకేతాన్ని ఇవ్వడం ఫ్యాన్స్ లో జోష్ పెంచింది.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్పీచ్ చాలా సింపుల్‌గా సాగిపోయింది. ఎప్పుడూ నాన్న నందమూరి హరికృష్ణని గుర్తు చేసుకొంటూనే స్పీచ్ మొదలెడతారు తారక్. ఈసారీ అదే చేశారు. నాన్న లేని లోటు విజయశాంతిగారితో తీరిందని, హీరోయిన్లలో విజయశాంతి ఫీట్స్‌ని ఎవరూ దాటలేరని, ఆమె సాటి మరెవ్వరూ రారన్నారు ఎన్టీఆర్. కల్యాణ్ రామ్ స్పీచ్‌లో కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. సాధారణంగా సినిమా అయిపోయిన తరవాత, థియేటర్ దగ్గరే ఆ సినిమాని మర్చిపోతారని, కొన్ని సినిమాలు మాత్రం మనసుని హత్తుకొంటాయని, చాలాకాలం గుర్తుండిపోతాయని, అలాంటి సినిమాల్లో అర్జున్ సన్నాఫ్ వైజయంతీ ఒకటని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తరవాత అలాంటి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ కథ వచ్చిందని, మొదట్నుంచీ ఈ ప్రాజెక్ట్ పై పాజిటీవ్ వైబ్స్ ఉన్నాయని, ఎడిటింగ్ రూమ్ నుంచే ‘హిట్’ టాక్ బయటకు వచ్చిందని, మరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని విజయశాంతది పేర్కొన్నారు.