ఓ హీరో కోసం అనుకొన్న టైటిల్ తిరిగి తిరిగి మరో హీరో చేతికి చిక్కడం టాలీవుడ్లో మామూలే. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఎన్టీఆర్ కోసం ఫిక్స్ చేసిన ఓ టైటిల్ కల్యాణ్ రామ్ సినిమాకి ఫిక్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ అన్నాదమ్ములే కాబట్టి.. ఆ టైటిల్‌కి మరింత క్రేజ్ వచ్చింది. విషయమేంటంటే… ఇజం తరవాత కల్యాణ్‌రామ్ మరో సినిమా చేయలేదు. ఈ మధ్యలో చాలా కథలు విన్నా… దేనికీ ఓకే చెప్పలేదు. ఇప్పుడు ఉపేంద్ర అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు.. కల్యాణ్ రామ్ ఓకే చెప్పాడట. ఈ సినిమాకి ‘ఎం.ఎల్.ఏ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఇది వరకు ఎన్టీఆర్ సినిమా కోసం ఈ టైటిల్ పరిశీలించారు. రామయ్యా వస్తావయ్యా సినిమా సమయంలో ఈ టైటిల్ తెగ షికారు చేసింది. మంచి లక్షణాలున్న అబ్బాయి అనే క్యాప్షన్ కూడా అనుకొన్నారు. ఇప్పుడు ఇదే టైటిల్ కల్యాణ్ రామ్ సినిమాకి పరిశీలించడం విశేషమే. ఇదో పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ఓ ఎం.ఎల్.ఏని సవాల్ చేసిన సామాన్యుడి కథ అని, ఎం.ఎల్.ఏ పై పంతంతో.. తాను ఎం.ఎల్.ఏ గా మారడమే ఈ కథకి క్లైమాక్స్ అని సమాచారం. అయితే ఈ పొలిటికల్ స్టోరీని ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తీయాలని కల్యాణ్ రామ్ ఫిక్సయ్యాడట. కథ దాదాపుగా ఓకే అయిపోయిందని, త్వరలోనే ఈసినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.