కొంత మంది రాజకీయ నేతలు తన పేరు వాడుకుంటున్నారని వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని మంచు మోహన్ బాబు ఇటీవల ఓ చట్టబద్ధమైన హెచ్చరిక జారీ చేశారు. ఆయన పేరును వైసీపీ నాయకులు వాడుకుంటూండటంతో ఈ పని చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా కొడాలి నాని వంటి వాళ్లు… పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తున్నారు. ఆయనకు రాజకీయ ఉద్దేశాలు అంటగడుతున్నారు.
ఇక టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య గొడవలుపెట్టడనికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆ పార్టీ నేతలు తరచూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటివి అడ్డుకట్ట వేయకపోతే ఇంకా విచ్చలవిడిగా వాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఒక్క ‘దేవర’ మాత్రం చేస్తున్నారు. తర్వాత వార్ సిరీస్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మెయిన్ హీరోగా మరో హిందీ సినిమా చేస్తున్నారు. రాజకీయాలపై పట్టించుకునే తీరిక ఆయనకు లేదు.
ఎన్టీఆర్ లైట్ తీసుకుంటున్నారన్న ఉద్దేశంతో ఆయన పేరును పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసేందుకు… కొంతమంది వెనుకాడటం లేదు. దాని వల్ల ఎన్టీఆర్ కే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఈ విషయంలో మోహన్ బాబులాగా.. ఓ చట్టబద్దమైన హెచ్చరిక రాజకీయ నేతలందరికీ చేస్తే సరిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి జూనియర్ లీగల్ టీం దృష్టికి వెళ్తుందా ?