కోవిడ్ తో.. తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలమైపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. కోవిడ్ భయాలతోనే సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ ప్రభావం.. బుల్లి తెరపై కూడా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ `మీలో ఎవరు కోటీశ్వరుడు`పై కోవిడ్ గట్టిగా ఎఫెక్ట్ చూపిస్తోంది. త్వరలోనే జెమినీలో ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ షోకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇది వరకు ఇలాంటి షోలలో పాల్గొనడానికి చాలామంది పోటీ పడేవారు. లక్షలాది అప్లికేషన్లు వచ్చేవి. వాటిని స్కూట్నీ చేసి, అభ్యర్థుల్ని పిలిపించి, ఇంటర్వ్యూలు చేసి, అప్పుడు సెలెక్ట్ చేసేవాళ్లు. లక్షల్లో ఉండే అప్లికేషన్లు ఇప్పుడు వందల్లోకి తగ్గిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కోవిడ్ భయాల కారణంగా… జనాలు ఇళ్లు విడచి, బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదనేదానికి ఇదే నిదర్శనం. దానికి తోడు… ఇలాంటి షోలలో పాల్గొనే ఉత్సాహం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇలాంటి షోలు సెలబ్రెటీల కోసమే అనే అపోహ మొదలైపోయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు.. సినిమా ప్రమోషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో, సామాన్యుల్ని హాట్ సీట్లో కూర్చోబెట్టడం తక్కువ అవుతోంది. దాంతో.. కూడా పోటీదారుల్లో కాస్త అసంతృప్తి ఉండొచ్చు.