‘కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేసేవాడిని అత్తా… బయటకు కనపడని యుద్ధం చేసేవాడిని!’ – ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌లో పవన్‌కల్యాణ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్! ఆదివారం జరిగిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్ ఇదే డైలాగ్ చెప్పారు. త్రివిక్రమ్ పరిస్థితి వివరించడానికి ఈ డైలాగ్ ఉపయోగించారు. అత్తారిల్లు చిత్రంలో కన్నీటిపర్యంతమవుతూ పవన్ చెప్పిన ఆ డైలాగ్.. ఓ మనిషిలో అంతర్గత సంఘర్షణకు అద్దం పట్టింది. తనకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు త్రివిక్రమ్ పరిస్థితి కూడా అదే విధంగా వుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘అరవింద సమేత…’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఈ కథ కంటే ముందు త్రివిక్రమ్‌గారు నాకు రెండు కథలు చెప్పారు. కానీ, ఆ కథలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో స్పార్క్ నాకు కనిపించలేదు. ఆయనలో ఏదో సందిగ్ధం వుంది. ఓ సినిమా కోసం ఆయనే డైలాగ్ రాశారు కదా… కనిపించని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేశారు. చివరకు ఈ కథ చెప్పారు. ఈ కథ చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో ఒక స్పార్క్ చూశా. త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను ఎటువంటి సినిమా చేయాలనుకుంటున్నానో… అటువంటి కథ చెప్పారు. ఆయన దర్శకత్వంలో నేను కేవలం కామెడీ సినిమా మాత్రమే చేయాలనుకోలేదు. నవరసాల్లో కామెడీ అనేది ఒక రసం మాత్రమే. అది కాకుండా బలమైన బావోద్వేగాలను చెప్పగల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్’’ అని అన్నారు. రాబోయే రోజుల్లో తన పిల్లలకు గర్వంగా చూపించుకునే చిత్రం ‘అరవింద సమేత’ అని ఎన్టీఆర్ ఉద్వేగంతో చెప్పారు. తనకు త్రివిక్రమ్ ఆత్మబంధువు అని మరోసారి చెప్పిన ఆయన, తన తల్లికి మరో కుమారుడిగా, భార్యకు అన్నగా, పిల్లలకు మావయ్యగా త్రివిక్రమ్‌ని అభివర్ణించారు. చిత్రవిజయం త్రివిక్రమ్‌దే అని ఎన్టీఆర్ చెప్పారు.