“బన్నీ” అనే సినిమాలో రఘుబాబు కళ్లు దొబ్బేస్తాడు బన్నీ. ఎలా జరిగిందిరా.. అంటే.. కొట్టి కళ్లు దొబ్బేశారన్నా… అని ఏడుస్తాడు..కమెడియన్. కళ్లు దొబ్బేయడం ఏందిరా అని.. మిగతా వాళ్లు ఆశ్చర్యపోతారు. ఆ స్థాయిలో కాకపోయినా…. అంతలా ఆశ్చర్యపరిచే ఘటన ఒకటి విశాఖలో జరిగింది. ఎవరు చేశారో.. ఎందుకు చేశారో కానీ.. ఏకంగా ఎన్టీఆర్ విగ్రహాన్నే దొబ్బేశారు. విశాఖ పట్నంలోని మధురవాడలో మార్కెట్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం చాలా కాలంగా ఉంది. నిలువెత్తు విగ్రహాన్ని టీడీపీ నేతలు పెట్టారు. అది పెట్టి కూడా చాలా కాలం అయింది. అక్కడ అదో.. అడ్రస్ మార్క్‌గా కూడా గుర్తింపు పొందింది. అలాంటి.. హఠాత్తుగా.. గురువారం ఉదయం.. ఆ ఎన్టీఆర్ విగ్రహం కనిపించలేదు.
ఏమైందా అని చూస్తే.. దిమ్మతో సహా.. కొంత మంది వ్యక్తులు వచ్చి.. పెకిలించుకుపోయారని తేలింది. దీంతో.. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు పెకిలించి తీసుకెళ్లిపోయారని.. తక్షణం వారిని పట్టుకుని విగ్రహాన్ని తెచ్చి.. ఎక్కడ ఉన్నది అక్కడే పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం విశాఖలో చర్చనీయాంశమయింది. నడిరోడ్డుపై ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లడం ఏమిటన్నదే హాట్ టాపిక్. మామూలుగా అయితే… ఎవరైనా.. విగ్రహం జోలికి వెళ్తే.. తక్షణం.. ఆ పార్టీ నేతలకు తెలిసిపోతుంది. కానీ ప్లాన్డ్ గా.. మున్సిపల్ కార్మికులుగా… చూసేవారికి నమ్మకం కలిగేలా చేసి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారని టీడీపీ నేతలంటున్నారు. అయితే.. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లిన వాళ్లు ఏం చేసుకుంటారో చాలా మందికి అర్థం కావడం లేదు.
అక్కడ విగ్రహం ఉండటం ఇష్టం లేని ఇతర పార్టీల నేతలే.. కార్పొరేషన్ సిబ్బందితో కలిసి.. అధికార బలాన్ని ఉపయోగించి.. తీసుకెళ్లిపోయి ఉంటారన్న అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణం నిందితుల్ని పట్టుకుని.. మళ్లీ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డుపై ఉన్న విగ్రహాలనే.. కొట్టుకెళ్లిపోతే.. ఇక ప్రజల ఆస్తులకు సెక్యూరిటీ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.