ఈరోజు హైదరాబాద్ లో ‘MAD 2’ సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. MAD హీరో నితిన్ నార్ని ఎన్టీఆర్‌కు స్వయానా బామ్మర్ది. అంటే.. బామ్మర్ది కోసం బావ వస్తున్నాడన్నమాట. మరోటి… నాగవంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధం. నాగవంశీ – ఎన్టీఆర్ మధ్య ఉన్న ఎఫెక్షన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగవంశీ ఎప్పుడూ ఎన్టీఆర్ పేరు జపిస్తూనే ఉంటాడు. త్వరలో ఎన్టీఆర్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ వేడుకలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దయిన దగ్గర్నుంచి ఎన్టీఆర్‌ని ఏ సినిమా వేడుకలోనూ చూళ్లేకపోయారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు వాళ్లకు ఓ అవకాశం దక్కినట్టైంది.
నార్ని నితిన్‌కు ఇది వరుసగా మూడో విజయం. మ్యాడ్ 1, ఆయ్, మ్యాడ్ 2.. ఇలా హ్యాట్రిక్ విజయాల్ని అందుకొన్నారు నితిన్. ఇక మీదట కూడా జాగ్రత్తగా కథలు ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎన్టీఆర్ సలహాలూ తోడవుతున్నాయి. ఎన్టీఆర్ నితిన్‌కి ఓ సలహా ఇచ్చార్ట. ఇక మీదట కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్లు చేయమని చెప్పార్ట. నితిన్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు టాక్. ఈ రోజుల్లో ఓ హిట్ పడగానే, హీరోలంతా యాక్షన్, మాస్ కథలవైపు చూస్తున్నారు. నితిన్ మాత్రం లవ్ స్టోరీలపై ఫోకస్ పెడుతున్నాడు. ఇది మంచి ఆలోచనే. ఇటీవలే ఓ లవ్ స్టోరీకి నితిన్ ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు.