ఎన్టీఆర్ – సుకుమార్ కాంబోలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా వచ్చింది. సినిమా బాగానే ఉంటుంది కానీ, ఎక్కడో చిన్న వెలితి. అనుకొన్నంత స్థాయిలో బాక్సాఫీసు దగ్గర సక్సెస్ కాలేదు. అయితే ఇప్పటికీ టీవీల్లో చూస్తుంటే, `మంచి సినిమా` అనిపిస్తుంటుంది. ఎన్టీఆర్ స్టామినాని సుకుమార్ పూర్తి స్థాయిలో వాడుకోలేదన్న కంప్లైంట్ ఉంది. అది సుకుమార్‌కూ తెలుసు. ఆ లోటు తీర్చడానికి భవిష్యత్తులో వీరిద్దరూ మళ్లీ సినిమా చేయాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఆ తరుణం తొందరలోనే వుందా?
ఇటీవల ఎన్టీఆర్, సుకుమార్ ఇద్దరూ కలుసుకొన్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ‘పుష్ప 2’ సక్సెస్ తరవాత బన్నీ, చరణ్‌లను కాకుండా సుకుమార్ ఓ హీరోని కలవడం ఇదే. దాంతో ఏం జరుగుతోంది? వీరిద్దరూ ఎందుకు కలిశారు? మరోసారి సినిమా చేస్తారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
సుకుమార్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్లాన్ చేసుకొని కలవలేదు. ఓ ప్రైవేట్ పార్టీలో కలిశారంతే. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. బహుశా ఆ పార్టీకి సుకుమార్, ఎన్టీఆర్‌లు వచ్చి ఉంటారు. అక్కడ తీసిన ఫొటోలా అనిపిస్తోంది. దాన్నే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్, సుకుమార్.. ఈ కాంబో ఎప్పుడైనా సెట్ అవ్వొచ్చు. కానీ ఇప్పుడు అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే… ముందు చరణ్‌తో సినిమా చేయాలి సుకుమార్. ఆ తరవాత పుష్ప 3 ఉంటుంది. ఎన్టీఆర్ కూడా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పూర్తయి, ఎన్టీఆర్‌కు సరిపడా కథ దొరికాలి. ఒక్కో సినిమాకూ రెండేళ్లు పట్టినా.. సుకుమార్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లాలంటే కనీసం 4 ఏళ్లు ఆగాలి.