ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బుల్లి తెర కార్యక్రమం బిగ్ బాస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. హోస్ట్‌గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడు? ఈ కార్యక్రమాన్ని ఏ మేరకు రక్తి కట్టిస్తాడో అంటూ ఎన్టీఆర్ అభిమానులతో పాటు చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ ఏ మేరకు పారితోషికం తీసుకొన్నాడు? అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలుగునాట.. అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రియాలిటీ షో.. బిగ్ బాస్. ఈ షో కోసం రూ45 కోట్ల బడ్జెట్ కేటాయించార్ట. భవిష్యత్తులో ఈ అంకె పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి పారితోషికంగా రూ.25 కోట్లు ముట్టజెప్పినట్టు సమాచారం. అందులో సగం అడ్వాన్స్ గా చేతికి అందించార్ట.
70 రోజుల షో ఇది. ఎన్టీఆర్ మహా అయితే 20 రోజుల కాల్షీట్లు సర్దుబాటు చేస్తే చాలు. ఇరవై రోజులకు రూ.25 కోట్ల పారితోషికం ఇస్తున్నారంటే… అది ఎన్టీఆర్ స్టామినాకు నిదర్శనం అని చెప్పుకోవాలి. మీలో ఎవరు కోటీశ్వరుడు కి హోస్ట్‌గా వ్యవహరించినందుకు నాగార్జునకు చాలా తక్కువ మొత్తమే అందింది. చిరంజీవికి భారీగానే గిట్టుబాటు అయినా… ఎన్టీఆర్ స్థాయిలో మాత్రం కాదు. దక్షిణాదిన ఈ స్థాయిలో పారితోషికం తీసుకొన్న హోస్ట్ ఒక్క ఎన్టీఆరే అన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల మాట. తమిళ నాట ఈ కార్యక్రమానికి కమల్‌హాసన్ హోస్ట్. పారితోషికంలో ఎన్టీఆర్ కమల్ని దాటేశాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల రిపోర్ట్