ఎన్టీఆర్ బుల్లి తెరపై సందడి చేయబోతున్నాడా? యాంకర్ అవతారం ఎత్తుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ కనిపించనున్నాడన్నది లేటెస్ట్ టాక్. హిందీ వెర్షన్ ఇప్పటికే హిట్ అయ్యింది. తమిళంలో కమల్‌హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. తెలుగులోనూ బిగ్ బాస్ షోని ఓ స్టార్ హీరోకి అప్పగిస్తే బాగుంటుందని నిర్వాహకులు భావించారు. అందుకోసం ఎన్టీఆర్‌ని సంప్రదించారని, ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. ప్రస్తుతం పారితోషికం విషయంలో చర్చలు సాగుతున్నాయట. ఎన్టీఆర్ ప్రస్తుతం లవకుశ సినిమాతో బిజీగా ఉన్నాడు, ఆ తరవాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సివుంది. కొరటాల శివ కాంబో కూడా ఓకే అయ్యింది. ఎంత బిజీగా ఉన్నా సరే… వారానికి ఒక రోజు కాల్షీట్లు బిగ్ బాస్షోకి కేటాయిస్తే సరిపోతుంది. అందుకే… ఎన్టీఆర్ ఈ షోలో కనిపించడానికి ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. మా టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఎన్టీఆర్ నిజంగా ఈషోలో కనిపిస్తే.. బిగ్ బాస్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం.