తెలుగు సినిమా నంది అవార్డులపై రభసకు సంబంధించిన చర్చలో పాల్గొనాలని మూడు నాలుగు ఛానల్స్ నుంచి పిలుపు వచ్చినా మూడు రోజులు టూర్లో వుండటం వల్ల పాల్గొనలేకపోయాను. దానిపై వివరమైన వ్యాఖ్యానం మరోసారికి వాయిదా వేస్తూ ప్రస్తుతానికి ఒక ముఖ్యమైన సవరణ చేయవలసి వుంది. నటుడు మోహన్‌బాబు యథావిధిగా దీనిపై తన తీవ్రశైలిలో స్పందిస్తూ అన్న ఎన్టీఆర్‌కు ఏ నంది అవార్డు వచ్చిందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ 200 చిత్రమైన కోడలు దిద్దిన కాపురంలో నటనకు గాను 1970లో నంది అవార్డు వచ్చింది. ఆంతకు ముందు లవకుశ, రాజూపేద చిత్రాలకు గాను రాష్ట్రపతి పురస్కారం కూడా దక్కింది. ఎన్టీఆర్ స్వంతంగా నిర్మించి తను వయసు మళ్లిన పాత్ర ధరించిన తోడు దొంగలు, సీతారామకళ్యాణం,వరకట్నం వంటి చిత్రాలు కూడా జాతీయ గౌరవాలు పొందాయి. తొలిదశలోని పాతాళభైరవి అంతర్జాతీయ ప్రదర్శనలకు ఎంపికైంది. పద్మ అవార్డులకు సంబంధించి మాత్రం కేంద్రం వివక్ష చూపించి పద్మశ్రీతో ఆపేసింది. తోటి నటుడైన అక్కినేనికి పద్మ విభూషణ్ కూడా ఇచ్చి ఆ పైన దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక చేసింది. అలా చేసినందుకు సంతోషమే గాని ఎన్టీఆర్‌ను రాజకీయ కోణంలో పక్కనపెట్టడం మాత్రం తెలుగువారిని నొప్పించే విషయం.