ఎన్టీఆర్ కెరీర్లో యమదొంగ స్పెషల్ చిత్రం. ఆ సినిమాకి ముందు ఎన్టీఆర్‌కి హిట్లు లేవు. చాలా బ్యాడ్ పిరియడ్ నడుస్తోంది. దానికి తోడు బాగా లావుగా కనిపించేవాడు. యమదొంగలో ఓ కొత్త ఎన్టీఆర్‌ని రాజమౌళి చూపించాడు.. హిట్టు కొట్టాడు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలో దడదడలాడించింది కూడా ఆసినిమాలోనే. ఎన్టీఆర్ – రాజమౌళి… ఈ కాంబినేషన్‌కు తిరుగు లేదని చాటిచెప్పిన సినిమా అది. వాళ్లిద్దరికీ హ్యాట్రిక్ కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్లో సినిమానే రాలేదు. ఎన్టీఆర్, రాజమౌళి ఒకే వేదికపై ఎప్పుడు కనిపించినా, మీ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు అని అభిమానులు అరచి గోల చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాటికి కూడా యమదొంగ సినిమానే సమాధానం చెప్పబోతోందని టాక్.
యమదొంగ సినిమాకి సీక్వెల్ చేయాలని విజయేంద్ర ప్రసాద్ భావిస్తున్నార్ట. యమదొంగ లాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు సీక్వెల్స్ బాగా వర్కవుట్ అవుతాయని ఆయన నమ్మకం. పైగా సీక్వెల్ చేయడానికి అన్ని విధాలా అర్హతలున్న సినిమా. అందుకే విజయేంద్ర ప్రసాద్ యమదొంగ 2 కథ రాసే పనుల్లో బిజీగా ఉన్నార్ట. అది ఎన్టీఆర్తోనే చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి 2 పూర్తయిన తరవాత మహేష్, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేయాలని జక్కన్న నిర్ణయించుకొన్నాడు. అందులో భాగంగానే యమదొంగ 2 కథ రెడీ అవుతుందేమో మరి.