దక్షిణాది శక్తిసామర్థ్యాల్ని దేశమంతా చెప్పుకొనేలా చేసిన నవతరం దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకడు. కేజీఎఫ్, సలార్ సినిమాలు ప్రశాంత్ నీల్ స్టామినా ఏమిటో తెలియజెపుతాయి. కథని చెప్పే విధానం, హీరోయిజాన్ని పండించే పద్ధతి, ముఖ్యంగా ఎలివేషన్లు, ఎడిటింగ్ పేట్రన్ ఇవన్నీ… కొత్తగా అనిపిస్తాయి. మాస్ మీటర్ని పట్టి, ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా తీయడం, వరల్డ్ బిల్డింగ్ తో కొత్త రకంగా కథని చెప్పడం ప్రశాంత్ నీల్ స్టైల్. తన సినిమాకు వెళ్తే.. టికెట్ రేటు గిట్టుబాటు అయ్యేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. హీరోని బాగా చూపిస్తాడు. అయితే ఒకే ఒక్క కంప్లైంట్ ఉంది. తన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఓరకంగా నిర్లక్ష్యం చేస్తుంటాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2లో కథానాయిక పాత్ర తేలిపోతుంది. ‘సలార్’ లో అయితే శ్రుతిహాసన్ ఉన్నా, లేనట్టే. ఆమెది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు.
ఇప్పుడు ఎన్టీఆర్తో ‘డ్రాగన్’ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ని ఎంచుకొన్నారు. రుక్మిణి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పరిపడా కథానాయిక కాదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటించేంత స్టార్ డమ్ సైతం రుక్మిణికి లేదు. తను మంచి పెర్ఫార్మర్ అంతే. ఈ సినిమాలో కూడా రుక్మిణి పాత్రకు పెద్దగా స్కోప్ లేదని తెలుస్తోంది. `డ్రాగన్`లో పాటలకు కూడా ఛాన్స్ లేదని సమాచారం. ఎన్టీఆర్ మంచి డాన్సర్. తన సినిమాలో మాస్ బీట్ ఉన్న పాటల్ని కోరుకొంటారు ప్రేక్షకులు. ‘సలార్’లో కమర్షియల్ పాటలు లేకుండా చేసిన ప్రశాంత్ నీల్.. ఈసారి కూడా అదే పంధా ఫాలో అవుతున్నాడట. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ – రుక్మిణిల మధ్య పాటల్లేవని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ఫైట్ చేస్తే చాలు అనుకొంటారు ఫ్యాన్ప్. అయితే.. ఎన్టీఆర్ విషయంలో ఫ్యాన్స్ ఇలా సంతృప్తి పడిపోరు. వాళ్లకు డాన్స్ మూమెంట్స్ కావాల్సిందే. మరి ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో..?!