తెలుగువాళ్లను మద్రాసీలనుకునే పరిస్థితిని మార్చి… ప్రత్యేకంగా తెలుగువారికి ఓ గుర్తింపు తెచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు. ఆయనకు మరణం లేదు. తెలుగు జాతి ఉన్నంత కాలం.. ఆయన ఉంటూనే ఉంటారు. భౌతికంగా ఆయన… తెలుగుజాతిని ఒంటిని చేసి వెళ్లిపోయి నేటికి 23 ఏళ్లు. ఎన్టీఆర్.. ఆ మూడుక్షరాల పేరు చెబితే చాలు తెలుగు జాతి పులకించిపోతుంది. నటుడిగా ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. రాజకీయనేతగా తెలుగు జాతి అత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహా మనిషి. మహానటుడిగా ఆరాధించిన ప్రజల కష్టాలను తీర్చేందుకు నాయకుడి అవతారం ఎత్తారు. అపజయాలు.. అవమానాలు ఎన్నో భరించారు. కానీ తాను తుది శ్వాస వరకు తెలుగు జాతి ఔన్నత్యం కోసమే పోరాడారు.
జాతీయ రాజకీయాల్లో కీలక ప్రాత పోషించినా.. తెలుగు వారి ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ప్రజాధనం విలువేంటో తెలిసిన వ్యక్తి కనుక.. అధికారదర్పంతో డబ్బును దుబారా చేయలేదు. మహిళలకు ఆస్తి హక్కును ప్రకటించి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పేదల కోసం పనిచేయని ప్రభుత్వాలు ఎందుకని నిలదీసిన ఆయన అనునిత్యం పేదల సంక్షేమానికే పరితపించారు. ఆయన నవ్వితే.. యావత్ తెలుగు జాతి నవ్వింది.. ఆయన ఏడిస్తే.. తాను కంటనీరు పెట్టింది. ఆయన పిలిస్తే ప్రభంజనమైంది. తెలుగు జాతికి ఆత్మగా బాసిల్లిన ఆ మహా చైనత్యం… తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటుంది.
ఏ పనినైనా అంకితభావంతో చేయడం, ఆ పని ఎంత కష్టమైనా ఇష్టపడి చేయటం, తాను నమ్మిన ఆ పనిని సాధించటంలో మడమ తిప్పకుండా పోరాటం చెయ్యటం.. ఎన్టీఆర్ తెలుగుజాతికి నేర్పించిన ఆణిముత్యాలు. రాజకీయ పార్టీలు ఏవైనా.. ఎన్నికల సమయం దగ్గరపడితే ఆయన నామస్మరణే చేస్తున్నాయి. ఒక్క టీడీపీయే కాదు.. ఇతర పార్టీలు సైతం అప్పుడప్పుడు ఆయన పేరును వాడుకుంటున్నాయి.
“మరణంలేని జననం ఆయనిది.. అలుపెరగని గమనం ఆయనిది, అంతేలేని పయనం ఆయనిది..” జోహార్ ఎన్టీఆర్