‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ 2 నిమిషాల 40 సెకన్ల సుదీర్ఘ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అనుకొన్నట్టే ఈ ట్రైలర్‌ని యాక్షన్ హంగామాతో నింపేశాడు కొరటాల శివ. ఏ ట్రైలర్లో అయినా నాలుగైదు డైలాగులు వినిపిస్తాయి. అయితే ఈ ట్రైలర్ నిండా డైలాగులే. మరో విశేషం ఏమిటంటే.. ఈ డైలాగులన్నీ భయం, ధైర్యం చుట్టూ తిరిగేవే.
”కులం లేదు మతం లేదు ధైర్యం తప్ప ఏమీ లేదు”
”రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. దేవర కథ”
”మనిషికి బతికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే, ఆ ధైర్యన్ని చంపే భయమవుతా”
”దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా దొరకాల”
”పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగొస్తాడు. పంతం మీద పోయాడు నీ కొడుకు..”
”భయం మరచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే… ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతావుండా..”
ఇలా డైలాగుల పరంపర కొనసాగింది. సముద్రం నేపథ్యంలో సాగే కథ. ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం పోషించాడు. పెద దేవర ధైర్యవంతుడు. చిన దేవర.. భయస్థుడు. ఈ రెండు పాత్రల మధ్య స్పష్టమైన వైవిధ్యాన్ని చూపించాడు దర్శకుడు. టెక్నికల్ గా ఈ సినిమా తన స్థాయిని చాటుకొంది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర సైతం ప్రేక్షకుల్ని కన్ఫ్యూజన్కి గురి చేసింది. ఆ పాత్ర పాజిటీవ్ గా మొదలై, నెగిటీవ్ గా మారే ఛాన్సుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాత్రలు, వాళ్ల గెటప్పులు కూడా వెరైటీగా కనిపించాయి. జాన్వీ కపూర్ పాత్రని కూడా గ్లామర్ కోసం కాకుండా కథలో భాగం చేశాడు కొరటాల. ఓ రకంగా దేవర కోసం కొరటాల శివ ఓ ప్రపంచాన్నే సృష్టించాడనిపించింది. అనిరుథ్ ఆర్.ఆర్‌లోని బీజియమ్ హాంట్ చేసేదే. మొత్తానికి ట్రైలర్ అన్ని రకాలుగా ఫ్యాన్స్‌ని అలరించేదే. ఈ డైలాగులు, షాట్లూ కొన్నిరోజుల పాటు మాట్లాడుకొనేలా ఉన్నాయి. ఇదే స్పీడు సినిమాలోనూ చూపిస్తే ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.