అలవాట్లు మొదట్లో సాలెగూళ్లు. ఆ తరవాత ఇనుప గొలుసులు అంటుంటారు పెద్దలు. ఏ అలవాటైనా అది వ్యసనంగా మారనంత వరకూ బాగుంటుంది. లేదంటే… అందులోంచి బయటపడడం చాలా కష్టం. దిగ్గజ నటులకూ… ఏదో ఓ అలవాటు ఉంటుంది. వాటి నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ఈజీగా బయటపడినా, ఇంకొంతమంది మాత్రం వాటికి బానిసలు అయిపోతుంటారు. ఎన్టీఆర్‌కీ అలాంటి అలవాటు ఒకటుండేది. అందులోంచి బయటపడానికి ఓ దర్శకుడు గట్టి ప్రయత్నమే చేసి సఫలీకృతమయ్యారు.
ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే… ఎన్టీఆర్‌కి కిళ్లీ నమిలే అలవాటు ఉంది. భోజనం చేసిన తరవాత తప్పకుండా కిళ్లీ వేసుకునేవారు. సాయింత్రం మరో కిళ్లీ. రాత్రికి ఇంకోటి. ‘మాయా బజార్’ వరకూ ఈ అలవాటు మానలేదు. ‘మాయా బజార్’ సినిమాకి సంతకం చేసేటప్పుడు కె.వి రెడ్డి ఓషరతు విధించారు. ‘నువ్వు.. కిళ్లీ అలవాటు మానుకోవాలి. కిళ్లీ వల్ల పళ్లు పాడైపోతాయి. కృష్ణుడి పళ్లు తెల్లగా ఉండాలి. కిళ్లీ వేసుకుంటే… ఆ తెల్లదనం రాదు…’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం ఆ అలవాటు నుంచి బయటకు రాలేకపోతున్నారు. దాంతో కె.వి.రెడ్డి ఓ ప్లాన్ వేశారు. ఎన్టీఆర్‌కి ప్రతీరోజూ.. పదుల సంఖ్యలో కిళ్లీలు పంపేవారు. భోజనమూ అదే, అల్పాహారం అదే. ‘ఆకలేస్తోంది..’ అంటే కిళ్లీ పంపేవారు. దాదాపు మూడు రోజులు హౌస్ అరెస్ట్ లో ఉంచి.. కిళ్లీల మీద కిళ్లీలు తినిపించారు. దాంతో ఎన్టీఆర్‌కి కిళ్లీల మీద విరక్తి వచ్చి.. ‘ఇక నేనెప్పుడూ కిళ్లీ జోలికి పోను గురువుగారూ.. ఈ పూటకి భోజనం పంపించండి’ అనేంత వరకూ… కిళ్లీలతో దాడి కొనసాగింది. మొత్తానికి ఎన్టీఆర్ కి కిళ్లీలు వేసుకునే అలవాటు తప్పింది.
అయితే దాదాపు ఇరవై ఏళ్ల తరవాత.. ఓ సెట్లో మరోసారి కిళ్లీ తనని పలకరించింది. వేటూరి రూపంలో. వేటూరికి కూడా జర్దా కిళ్లీ వేసుకునే అలవాటు ఉంది. ఆయన దగ్గర ఓ చిన్నసైజు డబ్బా ఉండేది. అందులో ఆకు, వక్కా, జర్దా పుష్కలంగా ఉండేవి. ఎన్టీఆర్ సినిమాకి పాట రాయాలి వేటూరి. ఆరోజు సెట్ కి వచ్చి, ఆ పక్కనే కూర్చుని, జర్దా కిళ్లీ నములుతూ పాట రాయడం మొదలెట్టారు. సెట్లో రిలాక్స్ అవుతున్న ఎన్టీఆర్‌కి జర్దా వాసన గుప్పున కొట్టింది. ‘ఎవరది.. ఇక్కడ కిళ్లీ నములుతున్నారు’ అని ఆరా తీశారు ఎన్టీఆర్. దాంతో వేటూరి భయం భయంగానే ఎన్టీఆర్ ముందుకొచ్చారు. ‘నేనే అన్నగారూ.. నాకు కిళ్లీ అలవాటు. అది లేనిదే నాకు పాట రాయబుద్ధేయదు’ అన్నారు వినమ్రంగా. `ఏది.. ఆ డబ్బా ఇటు ఇవ్వండి` అంటూ వేటూరి నుంచి జర్దా డబ్బా తీసుకున్నారు. ఆకు, వక్కా, జర్దా చూడగానే ఎన్టీఆర్‌కి పాత అలవాటు గుర్తొచ్చింది. సరదాగా ఓ కిళ్లీ చుడదాం అనుకుని.. డబ్బా తీసి, ఆకు, వక్కా పేర్చి జర్దా చల్లారు. అయితే.. సాధారణ మోతాదు కంటే నాలుగైదు రెట్లు జర్దా ఎక్కువ పడింది. దాంతో వేటూరి కంగారు పడిపోయారు. ఎన్టీఆర్ జర్దా అలవాటు మానేసి ఏళ్లు దాటిపోయాయి. పైగా.. డోసు ఎక్కువైంది. అది తిని, కళ్లు తిరిగి పడిపోతే… అనే భయం ఆయనది. ఎన్టీఆర్ కి ఏమైనా అయితే.. సెట్లో తనని అందరూ దోషిగా చూస్తారని కంగారు పడ్డారు. అయితే జర్దా నములుతూ.. హాయిగా కుర్చీలో పడుకుని రిలాక్స్ అయిపోయారు ఎన్టీఆర్. ఆతరవాత దర్శకుడు ‘షాట్‌కి రండి సార్’ అని పిలిచేంత వరకూ ఎన్టీఆర్ జర్దాని ఆస్వాదిస్తూనే ఉన్నారు. దర్శకుడి నుంచి పిలుపురాగానే.. జర్దా ఊసేసి, నీళ్లతో నోరంతా పుక్కిలించుకుని.. మామూలుగానే వెళ్లిపోయారు. మరొకరైతే ఆ జర్దా ధాటికి కళ్లు తిరిగి పడిపోయేవారు, ఎన్టీఆర్ బాడీ స్టామినా అలాంటిది అంటూ వేటూరి తన ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తరవాత ఎన్టీఆర్ ఎప్పుడూ కిళ్లీ జోలికి పోలేదట. అదీ.. ఎన్టీఆర్ కిళ్లీ కథ.