నందమూరి కుటుంబంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. నందమూరి హరికృష్ణ అద్దంకి – నార్కట్‌పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరణించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. 61 ఏళ్ల హరికృష్ణ.. తండ్రి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో.. చైతన్యరథాన్ని నడిపి.. నందమూరి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.
నందమూరి హరికృష్ణ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు గండంగా మారాయి. 2009 జూనియర్ ఎన్టీఆర్ నల్లగొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తున్న సమయంలో సూర్యాపేట వద్ద కారు బోల్తా పడింది. దాంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ ప్రమాదం నుంచి ఆ కుటుంబం కోలుకుంటూండగానే… మరో సారి రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. ఈ సారి ఆయన పెద్దకుమారుడు జానకిరామ్ నల్లగొండ జిల్లాలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 2014 డిసెంబర్లో ఆకుపాముల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ ప్రాణాలు విడిచారు. జానకిరామ్ మరణం తర్వాత హరికృష్ణ పూర్తిగా కుంగిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా హరికృష్ణనే.. నల్లగొండ జిల్లా రోడ్డు మింగేశాయి.
హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం.. నందమూరి అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తోంది. జానకిరామ్ మరణం నుంచి కోలుకుని.. ఇప్పుడిప్పుడే ఆయన … కొద్దిగా .. యాక్టివ్ అవుతున్నారని కుటుంబ సభ్యులు అనుకునేలోపే ఆయన దూరం కావడం.. అందర్నీ కలచి వేస్తోంది.