జనతా గ్యారేజ్ ఆడియో వేడుక వేదికగా అభిమానులకు చిన్న పాటి క్లాస్ తీసుకొన్నాడు ఎన్టీఆర్. తన ఫొటోలకు కొంతమంది పాలాభిషేకాలు చేస్తున్నారని అది చూసి బాధ పడ్డానని, ఇకమీదెప్పుడూ అలాంటి పనులు చేయొద్దని హితవు పలికాడు. ”నేను నటుడ్ని. మీ తమ్ముడ్ని..అన్నయ్యని. కానీ దేవుడ్ని కాదు. నన్ను దేవుడ్ని చేయొద్దు. దయచేసి అభిషేకాల పేరుతో పాలను పాడు చేయొద్దు. దాన్ని ఎవరికైనా దానం చేసి వాళ్ల కడుపు నింపండి” అని కోరుకొన్నాడు. అంతే కాదు… అభిమానం పేరుతో మూగ జీవాల్ని బలి ఇవ్వొద్దని అభిమానులకు సూచించాడు. ”నాన్నకు ప్రేమతో సమయంలో కటౌట్ల ముందు బలి ఇస్తున్న వీడియో చూశా. ఆ డబ్బుతో అన్నదానం చేయండి. ఒకరి కడుపు నింపినా అది మీకూ.. నాకూ పుణ్యమే. దయ చేసి ఈ రెండు విషయాల్నీ దృష్టి లో ఉంచుకోండి..” అని కోరుకొన్నాడు.
పుష్కరం తరవాత ఓ సూపర్ డూపర్ హిట్ జనతా గ్యారేజ్ రూపంలో ఇస్తున్నానని అభిమానుల్లో హుషారు నింపాడు ఎన్టీఆర్. ఫ్లాపుల్లో ఉన్న తనకు టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలు దారి చూపాయని…. జనతా గ్యారేజ్‌తో తనకెంతో ఆత్మసంతృప్తి లభించిందన్నాడు. మోహన్ లాల్ లాంటి అద్భుతమైన వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం ఈసినిమా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అభిమానుల ప్రేమ కోసం మళ్లీ మళ్లీ పుడుతుంటానని.. హార్ట్ టచింగ్ స్పీచ్ ఇచ్చాడు.